ఇండియా పేరుతో ఏర్పాటైన కూటమి వేగం పెంచింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు సీట్ల సర్దుబాటు పూర్తి కావాలని అలయెన్స్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఐనా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఉన్న వైరం అక్కడ వారిని దగ్గరకు చేర్చలేని పరిస్థితిని సృష్టిస్తోంది. దానితో కొన్ని నిర్ణయాలు వాయిదా వేయాల్సిన అనివార్యత ఏర్పడింది.
పశ్చిమ బెంగాల్, కేరళ సర్దుబాటుపై అనుమానాలు
దేశమంతా ఒక రూలు అయితే పశ్చిమ బెంగాల్, కేరళకు మరో రూలు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఆ రెండు రాష్ట్రాలపై ఇండియా గ్రూపు పునరాలోచనలో పడింది. ఇప్పుటికీ సీట్ల చర్చలు మొదలై సెప్టెంబరు ఆఖరుకు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నప్పటికీ….కేరళ, పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం ఏమైనా జరగొచ్చు, జరగకపోవచ్చు అన్న ప్రస్తావనే వస్తోంది. రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళలో వామపక్షాలు, కాంగ్రెస్ పట్ల అనుమానంగానూ, వ్యతిరేకతా భావంగానూ చూడటమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. అందుకే వీలైనంతగా కలిసి పోటీ చేస్తామని ఇండియా గ్రూపు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రాహుల్ తీరుపై సీపీఎం ఆగ్రహం
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై కేరళలోని అధికార పార్టీ సీపీఎం గుర్రుగానే ఉంది. వాయినాడ్ లోక్ సభా స్థానం నుంచి రాహుల్ పోటీ చేయడానికి 2019లో సీపీఎం వ్యతిరేకించింది. తమకు ఉన్నది ఒక రాష్ట్రమే అయితే అక్కడ కూడా చెడగొట్టేందుకు కాంగ్రెస్ తయారైందని సీపీఎం నేతృత్వ వామపక్షాలు కారాలు మిరియాలు నూరాయి. కాకపోతే వాయినాడ్ లో పోటీ చేసి గెలవకపోతే రాహుల్ గాంధీ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని చెప్పేందుకు సందేహించకూడదు. ఇటీవల సీట్ల సర్దుబాటుపై ఇండియా గ్రూపులో జరిగిన చర్చల సందర్భంగా కూడా కాంగ్రెస్, వామపక్షల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని గత అనుభవాలను సీపీఎం నేతలు మీటింగ్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది.
ఏచూరీ, డీ రాజా కీలకం
కేరళలో ఇండియా కూటమి మనుగడ సాగించాలంటే వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరీ, డీ. రాజా చొరవ చూపాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ బలపడిన తర్వాత పరిస్థితులను అర్థం చేసుకున్న ఏచూరీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేరళలో బీజేపీ బలపడకుండా చూడాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడమొక్కటే మార్గమని ఆయన ఎప్పుడో గుర్తించారు. అనాదిగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంటుందని ఎప్పటికప్పుడు పరిణామాలు చెబుతున్నాయి. కేరళలో మొత్తం 20 లోక్ సభా స్థానాలుంటే 2019లో కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల నెగ్గింది. అధికార ఎల్డీఎఫ్ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానితో వాస్తవ స్థితిని అర్థం చేసుకున్న ఏచూరీ… సర్దుకుపోయి కాంగ్రెస్ తో విస్తృతస్థాయిలో పొత్తుకు అంగీకరిస్తారని భావిస్తున్నారు. ఎందుకంటే గతం వేరు, వర్తమానం వేరు. ఇప్పుడు భేషజాలకు పోతే పుట్టగతులుండవని కమ్యూనిస్టులు గ్రహించే ఉంటారు.