‘777 చార్లి’ సినిమాతో రక్షిత్ శెట్టి సౌత్ ప్రేక్షకులందరకీ బాగా చేరువైపోయాడు. అప్పటి నుంచి రక్షిత్ శెట్టి నటించిన సినిమాలపై ప్రేక్షకులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. తన రీసెంట్ మూవీ ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ ఏ’. హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రక్షిత్ శెట్టి నిర్మాత, రుక్మిణి వసంత్ హీరోయిన్. సెప్టెంబరు 1న కన్నడలో విడుదలైన ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడీ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ నెల 22న తెలుగులో విడుదల చేస్తోంది. అంతలా కన్నడ ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ స్టోరీ ఏంటంటే…
మనుగా నటించిన రక్షిత్ శెట్టి ఓ కారు డ్రైవర్. శేఖర్ గౌడ అనే పెద్ద బిజినెస్ మెన్ దగ్గర పనిచేస్తుంటాడు. ప్రియురాలు ప్రియ సింగర్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటుంది. మను-ప్రియ ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకుంటారు. ప్రియకు సముద్రం అంటే చాలా ఇష్టం..తన ప్రేమను, మనుని సముద్రంతో పోల్చే ప్రియ…అదే సముద్రానికి దగ్గరగా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంది. త్వరలో పెళ్లి అనే సమయంలో..మను యజమాని కొడుకు ఓ యాక్సిడెంట్ చేస్తాడు. తన కొడుకు బదులు జైలుకి వెళితే భారీగా డబ్బు ఇవ్వడంతో పాటూ, కొద్దిరోజుల్లోనే జైల్లోంచి విడిపిస్తానని మాటిస్తాడు. ప్రియ వద్దని చెప్పినా వినకుండా..ఆ డబ్బుతో సముద్రం ఒడ్డున ఇల్లు కట్టుకోవచ్చని నచ్చజెప్పి ఆ నేరం తనపై వేసుకుంటాడు. కానీ జైలుకి వెళ్లిన మనుకి బెయిర్ దొరకదు, అదే సమయంలో యజమాని శేఖర్ గౌడ గుండెపోటుతో చనిపోతాడు. ఆ తర్వాత జైల్లో ఏం జరిగింది? మను బయటపడ్డాడా? ప్రియ ఏమైందన్నదే స్టోరీ…
నిత్యం తెరపై చూసే ప్రేమకథల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరకు లవర్స్ కలసిపోతారు. కానీ ఈ మూవీలో హీరోయిన్ వేరే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ప్రేమను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందనే సన్నివేశాలు, జైల్లో జరిగే అరాచకాలు ప్రేక్షకులకు కదిలిస్తాయి. కన్నడలో ఈ మూవీ సక్సెస్ కి కారణం ఇదే. తెలుగులో ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరి తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.