మూడు తొండాలతో లంబోదరుడు కొలువైన ఆలయం ఇది!

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా

గజముఖం, ఏకదంతం, వక్రతుండం, మహాకాయం, లంబోదరం అంటూ వినాయకుడిని పూజిస్తారు. వినాయకుడి రూపం ఇదే..మరి మూడు తొండాలున్న గణపయ్యను చూశారా? వినాయక నవరాత్రులు కదా ఏ మండపంలోనో ఉందేమో అనుకుంటే పొరపాటే. మూడు తొండాలతో కొలువైన ఆలయమే ఉంది. ఆ విశేషాలు మీకోసం..

పూణెలో సోమ్వర్ పేట్ జిల్లాలో నజగిరి అనే నదీతీరంలో ఉంది త్రిసూంద్ గణపయ్య ఆలయం. ఇక్కడ కొలువైన వినాయకుడికి మూడు తొండాలుంటాయి. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టి నిర్మాణం పూర్తిచేసేందుకు పదహారేళ్లు పట్టింది. 1770లో వినాయకుడిని ప్రతిష్టించారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి..స్వామివారు నెమలి వాహనంపై ఆసీనులై ఉంటారు. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు, ఆలయం మొత్తంమీద చెక్కిన దేవతా విగ్రహాలు చూపు తిప్పుకోనివ్వవు. ఎంత కష్టంలో ఉన్నా ఇక్కడ వినాయకుడిని భక్తితో దర్శించుకుంటే అవి తీరుపోతాయని భక్తుల విశ్వాసం.

ఘనంగా సంకటహర చతుర్థి
ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నెలకో సంకటహర చతుర్థి వస్తుంది..ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ మామూలుగా ఉండదు. ఇక వినాయక చవితి ఉత్సవాలు మరింత ప్రత్యేకం. నవరాత్రులు పూణె చుట్టుపక్కల నుంచి భారీగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్‌ నడిపిస్తోంది.

ఆలయంలోనే సమాధి
ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్‌ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం కింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.