రజాకార్ సినిమా ట్రైలర్ విడుదల అయింది . ట్రైలర్ చూసిన చాలా మంది నాటి రజాకార్ల ఆకృత్యాలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే వెంటనే బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బెదిరింపులు ప్రారంభించారు. ఈ సినిమాను నిషేధిస్తామని హెచ్చరికలు ప్రారంభించారు. కానీ అవి నిజాలన్న సంగతిని మాత్రం ఆయన మర్చిపోతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశించి తీశారని ఆయన దీర్ఘాలు తీస్తున్నారు. నిజాలు చెబితే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.. అందులో రాజకీయం ఏముందని ఇతర వర్గాల ప్రశ్న.
రజాకార్ సినిమాల్లో అబద్దాలుంటే చెప్పొచ్చు !
రజాకార్ సినిమాలో నిజాలు చెబితే తప్పేమిటన్నది ఎక్కువ మంది నుచి వస్తున్న ప్రశ్న. ఈ సినిమా వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చాయి. అసలు రాజకీయాల కోసమే ఈ సినిమా తీశారని అంటున్నారు. అవును.. నిజాలు చెప్పి రాజకీయం చేద్దామని తీస్తున్నామని తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ అంటున్నారు. కేటీఆర్ మాటే వేద వాక్కు అనుకునే బీఆర్ఎస్ నేతలంతా విరుచుకుపడుతున్నారు. సహజంగానే బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజాలు చెబితే మీకేమి నొప్పి అని ప్రశ్నిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతల దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే అసలు రాజకీయ ఎజెండా వారిదే మరి.
రజాకార్ల ఆగడాలు నిజమే కదా !
రాజాకార్ సినిమా కశ్మీర్ ఫైల్స్.. కేరళ ఫైల్స్ తరహాలో ఉంటుంది. బీజేపీ నేత గూడూరు నారాయణరావు సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టుగా సినిమా వర్గాలు చెబుతున్నాయి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో పారామిలిటరీ వలంటీర్ దళాన్ని రజాకార్లుగా పిలుస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో వీరి విస్తరణ జరిగింది. హైదరాబాదులో ముస్లింల పాలనను కొనసాగించడానికి, భారత్లో విలీనానికి వ్యతిరేకంగా వీరి ప్రతిఘటించి పోరాటం చేశారు. అయితే.. అప్పట్లో వారు హిందువులతో పాటు ముస్లింలను కూడా టార్గెట్ చేసుకుని దాడులు చేశారు. దీన్నే సినిమాలో చూపిస్తున్నారు.
వివాదాస్పదం అయితే నిజం చెప్పకుండా ఉంటారా ?
‘ది కాశ్మీర్ ఫైల్స్’ ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాల్లో నిజం లేదని కొంత మంది విమర్శలు చేశారు. కానీ ఆ సినిమాలను కోట్ల మంది చూశారు. అంటే నిజం ఉందని ఒప్పుకున్నట్లే. ఏది ఏమైనా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది. పోరాటాల్లో ఆరితేరిన వారు కాబట్టి మంచి ఏది, చెడు ఏదన్న విషయాలను ఈజీగా గుర్తించగలరు. కేటీఆర్ లాంటి వారు మజ్లిస్ లాంటి పార్టీల ప్రాపకం కోసం సినిమాల మీద విమర్శలు చేయవచ్చు కానీ.. నిజాలు మాత్రం వెల్లడి కాకుండా ఉండవని బీజేపీ నేతలంటున్నారు.