సిక్కోలు రాజకీయాలు ఎప్పటకప్పుడు హాట్ హాట్‌గా మారుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోరు నువ్వానేనా అనేలా సాగుతున్న టైంలో అధికార పక్షంలోనే అసంతృప్తి కాస్త కలవర పెడుతోంది. కొత్తగా జనసేన కూడా టీడీపీతో కలిసింది. జిల్లా వైసీపీలో వర్గపోరు కొన్నిచోట్ల చాపకింద నీరులా ఉంటే.. మరికొన్ని చోట్ల బహిరంగంగానే కనిపిస్తోంది. దీంతో అధికారంలో ఉన్నామనే ఆనందం పార్టీ జెండా మోసుకుతిరుగుతున్న శ్రేణుల్లో కనబడటం లేదన్న విమర్శ గట్టిగానే వినిపిస్తోంది. పార్టీనే నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు గుర్తింపు లేదన్న అసహనం చాలా మందిలో కనిపిస్తోంది. వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని వైసీపీలోని ఓ వర్గం చెబుతోంది.
సైలెంట్ గా సీనియర్ నేతలు
డిప్యూటీ సీఎంగా పని చేసిన కృష్ణదాసు.. ఆయన సిగ్మెంటు వరకే పరిమితమయ్యేరనే విమర్శలు ఉన్నాయి. మంత్రి అప్పలరాజు పలాసకు, జడ్పీ ఛైర్పర్సన్ ఇచ్ఛాపురం సిగ్మంటుకే పరిమితమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాపార్టీ శ్రేణులను ఒకతాటిపైకి తెచ్చి సమస్యలు పరిష్కరించడంలోను, కార్యకర్తల అభిప్రాయలు తెలుసుకుని అండగా నిలవడంలో ఎవరూ ముందుకు రావడంలేదనే ఆరోపణ ఉంది. ఆయన సోదరుడే.. పదవిని పొందారు. కానీ ఇద్దరి మధ్య సఖ్యత లేదు.
ముదురుతున్న వర్గ పోరు
ఎచ్చెర్ల, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస సిగ్మెంటులలో వర్గపోరు ముదురుతోంది. దీనిపై పార్టీ పెద్దలు అనేక పంచాయితీలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో విభేదాలు తొలగిపోలేదు. నాయకులు, ఎమ్మెల్యేలు, మధ్య సమన్వయం లేకపోగా ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్, నిన్నటి వరకు జిల్లా పార్టీ అధ్యక్షరాలుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వర్గీయులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ మధ్య బాహటంగా దువ్వాడ, తిలక్ వర్గీయులు రోడ్డెక్కి ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితి తెలిసిందే. ధర్మాన కృష్ణదాస్ జోక్యం చేసుకున్నా సద్దుమణగలేదు. చివరకు ముఖ్యమంత్రి పంచాయితీలో వారిద్దరిని కలిపారు. ఇది అమరావతికి లేక వారిద్దరికి పరిమిత తప్ప, క్షేత్రస్థాయిలో క్యాడర్ కలిసే పరిస్థితి కానరాడంలేదు.
స్పీకర్‌కూ తప్పని అసంతృప్తి
పాతపట్నం సిగ్మెంటులో స్థానిక ఎన్నికల నుంచి రాజుకున్న వర్గపోరు సమసి పోలేదు. అక్కడి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడిని హిరమండలం జడ్పీటీసీగా బరిలోదించిన గెలిపించుకోలేకపోయారు.
ఆముదాలవలస సిగ్మెంటులో కూడా స్పీకర్ తమ్మినేని సీతారాంకు వ్యతిరేకంగా ఓ కోటరీ ఏర్పడింది. ఇప్పటికే ఒకటి రెండు సార్లు ఆమదాలవలస, పొందూరు మండల నాయకులు సీతారాంకు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పర్చుకున్నారు. అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ముసలం మొదలై గాలివానలా మారుతోంది. అలాగే ఎచ్చెర్ల సిగ్మెంటులో కూడ అక్కడి ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌పై తిరుగుబాటు ప్రకటించారు. ఎచ్చెర్ల రణస్థలం లావేరు మండలాలకు చెందిన కొందరు నాయకులు ఓ కూటమిగా ఏర్పడి ఎమ్మెల్యే పనితీరు బాగోలేదంటూ బహిరంగంగానే మీడియా ముందుకు వచ్చారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిగ్మెంటుకు కొత్తగా ఇన్చార్జీని నియమించాలని అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ వ్యవహారాలతో శ్రీకాకుళం వైసీపీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకున్న బొత్స పూర్తిగా సైలెంట్ అయ్యారు.