జూ.ఎన్టీఆర్ ఇక టీడీపీకి లేనట్లేనా ? అచ్చెన్నాయుడు వ్యాఖ్యల అర్థం అదేనా ?

చంద్రబాబునాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశమయింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. స్పందించాలని తాము ఎవరినీ అడగడం లేదన్నారు. అచ్చెన్నాయుడు ఇలా వ్యాఖ్యానించడం ద్వారా.. ఎన్టీఆర్ స్పందించలేదన్న నిరాశలో ఉన్నట్లుగా స్పష్టమవుతుంది.

తాము ఎవర్నీ అడగబోమంటున్న టీడీపీ

చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని తాము ఎవర్నీ అడగబోమని .. ఎవరైనా స్పందించకపోతే వాళ్లనే అడగాలంటున్నారు అచ్చెన్నా. అడిగితే తాను ఏం చెపుతానని అన్నారు. జనసేనతో రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు. టీడీపీ చేపట్టిన దీక్షల్లో జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయని అంటున్నారు. అంటే పవన్ మాత్రమే తమకు శ్రేయోభిలాషి అని ఎన్టీఆర్ కాదని చెప్పినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.

కుటుంబసభ్యుడిగా కూడా జూనియర్ ెందుకు స్పందించలేదు ?

చంద్రబాబును అరెస్టు చేయడంపై అందరూ స్పందిస్తున్నారు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశమయింది. ఇది రాజకీయంగా మద్దతు ప్రకటించడం కాదని.. కష్టకాలంలో కుటుంబసభ్యునికి అండగా నిలవడం అని.. చాలా మంది విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఓ అవార్డు ఫంక్షన్ కు ఆయన దుబాయ్ వెళ్లారు. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ , టీడీపీ ఫ్యాన్స్ మధ్య తరచూ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఎన్టీఆర్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నరని అలాంటి ప్రకటనలు కూడా చేయలేదంటున్నారు.

వైసీపీలో జూనియర్ సన్నిహితులు

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆ తర్వాత వైసీపీలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ అంతకు ముందు నుంచే టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కలిసినప్పుడల్లా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటున్న దృశ్యాలు వెలుగులోకి వస్తూంటాయి. అయితే రాజకీయ పరమైన సందర్భాల్లో అందరూ స్పందిస్తున్నా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం స్పందించడం లేదు. ఇది టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణల విషయంలో ఎన్టీఆర్ అంత సానుకూలంగా లేరని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ ఓ సారి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏం చర్చించారో ఎవరికీ తెలియదు కానీ.. ఆయన మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. అన్ని రాజకీయ అంశాలకూ జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నారు.