హిందీ వ్యతిరేకోద్యమం, బ్రాహ్మణ -బనియాలపై ఉద్యమంతో ఫేమస్ అయిన డీఎంకే.. తన 74వ వసంతంలోకి అడుగు పెట్టింది. సెప్టెంబరు 17న పుట్టిన రోజు జరుపుకుంటున్న ద్రవిడ మున్నెట్ర కళగం(డీఎంకే) కొన్ని సందర్భాల్లో రాజకీయంగా సక్సెస్ అయి ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్నప్పటికీ విధానపరంగా మాత్రం ఆ పార్టీపై విమర్శల జడివాన కురుస్తూనే ఉంది. రాజకీయ దివాలాకోరుతనానికి దిగుతుందన్న ఆరోపణలు నిత్యం వినిపిస్తునే ఉన్నాయి…
1949 నుంచి అదే తీరు…
1949 సెప్టెంబరు 17న అన్నా దురై డీఎంకేను స్థాపించినప్పటి నుంచి పార్టీ విధానాల్లో పెద్దగా మార్పు లేదనే చెప్పాలి. ద్రావిడమ్, ద్రవిడనాడు అంటూ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కోరుతూనే ఉన్నారు. తమిళనాడు ప్రత్యేక దేశం కావాలని ఆకాంక్షించే వాళ్లున్నప్పటికీ ఇప్పుడా డిమాండ్ మరుగున పడిపోయింది. పెరియార్ తన వయసులో సగం ఉన్న మణియమ్మైని పెళ్లి చేసుకున్నందుకు ఆయనతో విభేదించి అన్నాదురై డీఎంకే పార్టీ పెట్టగా..ఎవరిని దూరంగా పెట్టాలనుకున్నారో వాళ్లతోనే తర్వాతి కాలంలో చేతులు కలిపారు. కాంగ్రెస్ తో , బీజేపీతో వేర్వేరు సందర్భాల్లో జతకట్టి రాజ్యాధికారాన్ని కాపాడుకున్న పార్టీల్లో డీఎంకే కూడా ఒకటని మరిచిపోకూడదు.
సర్దుకు పోవడమే విధానమా..
డీఎంకే తన విధానాలను మార్చుకుంటూనే ఉంది. పరిస్థితులను బట్టి మారని జాతికి మనుగడ లేదని ప్రస్తుత డీఎంకే సీఎం స్టాలిన్ ప్రకటించి తన సర్దుబాటు ధోరణిని చెప్పకనే చెప్పారు. ఫెడరల్ వ్యవస్థలో పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తికి తరచు డిమాండ్ చేసే డీఎంకే కొన్ని సందర్భాల్లో కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ ఇప్పుడా మాట మాట్లాడలేకపోతోంది. సంక్షేమ రాజ్యం పేరుతో ఒకప్పుడు రూపాయికే కిలో బియ్యాన్ని ఇచ్చిన డీఎంకే మధ్యలో బడ్జెట్ లేక ఆపేసిన సందర్భం కూడా ఉంది. కేంద్రప్రభుత్వ సహకారంతో ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం లక్షకోట్ల రూపాయలకు పైగా సబ్సిడీలకే వ్యయం చేస్తుంది. ఇందు కోసం డబ్బులు లేక మద్యం ఆాదాయంపై ఆధారపడుతోంది. మద్యం నుంచి ప్రతీ ఏటా 45 వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ సబ్సిడీల వ్యయంలో దాదాపు నలభై శాతాన్ని భర్తీ చేస్తోంది.
సమస్యల కంటే సనాతన వివాదమే ముఖ్యమా…
హిందువులు,హిందూ ధర్మంపై విరుచుకు పడటం డీఎంకేకు ఒక ఫ్యాషన్ గా చెప్పుకోవాలి. స్టాలిన్ అధికారాన్ని చేపట్టినప్పటికీ నుంచి ఉచితాలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చే తప్ప….అభివృద్ధి, అవకాశాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగాలు లేక యువత హాహాకారాలు చేస్తోంది. తమిళనాడులో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సమ్మిళిత అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కులవ్యవస్థ, కుల సంఘర్షణను వ్యవస్థలు ఆపలేకపోతున్నాయి. వీటన్నింటినీ వదిలేసి స్టాలిన్ తనయుడైన రాష్ట్ర మంత్రి ఉదయనిధి.. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పుడది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సనాతన ధర్మాన్ని తిరోగమన విధానంగా ప్రచారం చేస్తూ ఉపన్యాసాలు ఇచ్చే కంటే యువతకు అవసమైన పనులు చేపడితే బావుంటుందన్న అభిప్రాయం తమిళ సమాజంలో కలుగుతోంది. ఉద్యోగ అవకాశాలు పెంచే చర్యలు, సహేతుకమైన ఎన్నికల హామీలను అమలు చేయడం లాంటివి చేపట్టాల్సి ఉంది.