మీడియా బాయ్ కాట్ – ఇండియా గ్రూప్ తీరుపై విమర్శలు

విపక్ష పార్టీల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రశ్నించడమే తప్పు అన్నట్లుగా ఆ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. తప్పుడు విధానాలను విమర్శిస్తే తమను కొట్టినట్లుగా ఫీలవుతున్నాయి. కనీసం మాట్లాడేందుకు కూడా భయపడుతూ బాయ్ కాట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యానికే మచ్చ తెస్తుందని మరిచిపోతున్నాయి.

14 మంది టీవీ యాంకర్లపై నిషేధం

విపక్ష కూటమి ఇండియా అలెయన్స్ మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఎక్కడ నిలదీస్తారోనన్న భయం వారిలో కనిపిస్తోంది. 14 మంది న్యూస్ యాంకర్లను బాయ్ కాట్ చేస్తూ కూటమి నిన్న తీర్మానించింది. యాంకర్లు, వాళ్లు పనిచేసే ఛానెళ్లు నిర్వహించే చర్చా వేదికలకు తమ ప్రతినిధులను పంపబోమని ఇండియా కూటమి తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక జాబితాను కూడా విడుదల చేసింది. విద్వేషాన్ని వెదజల్లడం వల్లే ఆయా యాంకర్లను బాయ్ కాట్ చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అంటున్నారు. ఆయా యాంకర్లు తమ వైఖరిని మార్చుకుంటే వారితో చర్చల్లో పాల్గొనే విషయం పరిశీలిస్తామని ఖేరా చెబుతున్నారు. అదీ తమ బ్లాక్ లోని మీడియా కమిటీ నిర్ణయమని ఆయన వెల్లడిస్తున్నారు.

ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చాయన్న బీజేపీ

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి నియంతృత్వ వైఖరికి తాజా నిర్ణయం ఓ నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూనీ ఆరోపించారు. వాళ్లు తిరోగమన ఆలోచనా విధానంతో ఉన్నారని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ పీరియడ్ లో మీడియాపై ఆంక్షలు ఉండేవని, ఇప్పుడు మళ్లీ అత్యవసర పరిస్థితి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ అంటోంది. భావప్రకటనా స్వేచ్ఛను హరించే విధ్వంసకర ఆలోచనా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ చెబుతోంది. విపక్ష కూటమిలో గర్వం పెరిగిపోయిందని దాని వల్ల అందరినీ సమానంగా చూసే పరిస్థితి నుంచి దూరం జరిగారని కమలం పార్టీ ఆరోపిస్తోంది. మీడియాను ఇంత బహిరంగంగా బెదిరించడం ఎక్కడా చూడలేదని కూడా అనిల్ బలూనీ గుర్తు చేశారు. ఇదీ ప్రజల గొంతు నొక్కడమే అవుతుందని కూడా అన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ పురి కూడా ఇండియా కూటమి తీరును వ్యతిరేకించారు. సనాతన ధర్మాన్ని రూపుమాపాలని అనడం, జర్నవిస్టులపై ఎఫ్ఐఆర్ లు వేయించడం, మీడియాను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించడం చూస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయన్న భయం వేస్తోందని హర్దీప్ పురి ఆరోపించారు.

మీడియా సంఘాల నిరసన

ఇండియా కూటమి నిర్ణయంపై ది న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రమాదకరమైన సంస్కృతికి తెరతీశారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. స్వేచ్ఛాయుత పాత్రికేయానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పే పార్టీలు ఇలా ప్రవరించడం గర్హనీయమన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు వద్దని ఇండియా కూటమికి ఎన్బీడీఏ హితబోధ చేసింది. మీడియాను రాజకీయం చేయడం తగదని కూడా సూచించింది.