టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని ఎవరూ అనడం లేదు కానీ.. అరెస్ట్ చేసిన విధానం మాత్రం విమర్శలకు కారణం అవుతోంది. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు కూడా ఖండించారు. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాల్సి ఉందంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుకు భారీగా సానుభూతి వస్తుందని బండి సంజయ్ విశ్లేషిస్తున్నారు. కిషన్ రెడ్డి కూడా అరెస్ట్ కాదంటున్నారు.
అరెస్ట్ కారెక్ట్ కాదనే వాదన
చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అన్యాయమని కిషన్ రెడ్డి ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రిని దర్యాప్తు చేసే ముందు ప్రశ్నించకుండా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేసే సమయంలో కేంద్ర సర్కారు నోటీసులు ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే బాబును అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. కావాలని కక్ష పూరితంగానే అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరం చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరూ కాదనరని.. అయితే ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా వ్యక్తిని అరెస్టు చేయడమే అర్థం కావట్లేదని చెప్పారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ అరెస్టుతో ఏపీ ప్రజల్లో చంద్రబాబుకి మైలేజీ వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రజల్లో సానుభూతి కోసం టీడీపీ పక్కా ప్లాన్
మరో వైపు తాము వేధింపులకు గురవుతున్నామన్న సానుభూతి కోసం టీడీపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకించాలని టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. ‘బాబుతో నేను’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సైకో ప్రభుత్వాన్ని ప్రశ్నించి.. బాబుతోనే నేను అంటూ గొంతెత్తి చాటాలని ప్రజా చైతన్య కరపత్రాన్ని విడుదల చేసింది. 92612 92612 నంబర్ కు మిస్ట్ కాల్ ఇచ్చి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించాలని, బాబుతో నేను అని చాటి చెప్పాలని తెలుగు దేశం పార్టీ పిలుపునిచ్చింది. అరెస్టుకు చంద్రబాబు చేసిన తప్పు ఏంటి? అంటూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అంటూ కరపత్రంలో ప్రచురిస్తోంది.
అరెస్ట్ రాజకీయం పై దేశవ్యాప్తంగా టీడీపీ చర్చలు
టీడీపీ నేతలు చంద్రబాబుతో పరిచయం ఉన్న వారందరితో ప్రకటనలు చేయించుకుంటున్నారు. చంద్రబాబుని అర్ధరాత్రి వేళ, అనాగరికంగా అరెస్టు చేశారంటూ ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు లోకేష్ కూడా వెళ్లారు. ఎలా చూసినా అరెస్ట్ చేసిన విధానం మాత్రం ఏపీ రాజకీయాల్ని మార్చేలా పరిణామాలు సాగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.