ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల సేవలను ఏ ఏ పనులకు వాడుతున్నారో అందరికీ తెలుసు. వాళ్లను అన్ని రకాలుగా రాచి రంపాన పెడుతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు మాత్రం అందులో తప్పు లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వచ్చి పడింది. వారిని అధికార పార్టీ పనులకు వాడుతున్నారు..
బస్ ఇంఛార్జీలుగా ఉపాధ్యాయులు
ఈ వారం ప్రారంభంలో పంజాబ్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సిఖియ క్రాంతి ర్యాలీ నిర్వహించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరైన ఈ అమృత్ సర్ ర్యాలీకి ఆప్ కార్యకర్తలను బస్సుల్లో తరలించారు. ఐదు జిల్లాలో ఆప్ కార్యకర్తలను బస్సుల్లో తరలించే పనిని ఉపాధ్యాయులకు అప్పగించారు. వారిని నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ.. ఏ బస్సులో ఎవరు ప్రయాణించాలో నిర్ణయించే బాధ్యత డీఈఓలకు ఇచ్చారు. ప్రతీ జిల్లా నుంచి 130 నుంచి 150 మంది టీచర్లను ఈ పనులకు వినియోగించారు..
టిఫిన్, భోజనం పెట్టే పని..
ఉదయమే టీచర్లు తమకు కేటాయించిన బస్సుల దగ్గరకు వెళ్లి ఆప్ బ్యానర్లు కట్టాలని డీఈఓలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు అదేశించడంతో వాళ్లు అక్కడకు వెళ్లక తప్పలేదు. టీచర్లు బస్సు దగ్గరకు వెళ్లే పర్యవేక్షణను హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్ కు అప్పగించారు. ఆప్ కార్యకర్తలు బస్సు దగ్గరకు వచ్చిన వెంటనే వారికి టిఫన్ ప్యాకెట్లు ఇవ్వడం, మంచినీళ్లు సరఫరా చేయడం కూడా టీచర్లతోనే కానిచ్చేశారు. ర్యాలీ ప్రాంతంలో కార్యకర్తలు దిగిన తర్వాత వారు ఎటు వెళ్తున్నారో చూసుకోవడం, వారికి తాగునీరు, భోజనం అందిందా లేదా అని పర్యవేక్షించుకోవడం కూడా టీచర్లకే అప్పగించారు.
టీచర్లపై ఎమ్మెల్యేల పెత్తనం
కార్యకర్తలను వచ్చే పనిని స్థానిక ఎమ్మెల్యేల చూసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు జనాన్ని పట్టుకొచ్చి టీచర్లకు అప్పగిస్తే అమృత్ సర్ తీసుకెళ్లడం, మళ్లీ తీసుకురావడమంతా టీచర్లే చూసుకోవాల్సి వచ్చింది. ప్రతీ 20 మంది టీచర్లకు ఒక డీఈఓను ఇంఛార్జ్ గా పెట్టడం కూడా ఇందులో విశేషం. దూరప్రాంతాల నుంచి వచ్చే టీచర్లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఉదయం ఏడు గంటల కల్లా తమకు కేటాయించిన బస్సు దగ్గర ప్రత్యక్షం కావాల్సిందేనని ఆదేశించారు. పైగీ టీచర్లతో పాటు డీఈఓలు కూడా బస్సులో ప్రయాణిస్తూ ఆప్ కార్యకర్తల బాగోగులు చూసుకున్నారు.
ప్రతిఘటించినా ప్రయోజనం లేకపాయే…
పంజాబ్ డెమోక్రాటిక్ టీచర్స్ ఫ్రంట్ కు చెందిన కొందరు సభ్యులు బస్సు ఇంఛార్జ్ పని చేయబోమని ప్రతిఘటించినా వెళ్లక తప్పలేదు. రాజకీయ కార్యక్రమాలకు తాము ఎందుకు రావాలని నిలదీసినా ఉన్నతాధికారులు ఊరుకోలేదు. విద్యాశాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకే తాము ఈ పనులు అప్పగిస్తున్నామని, చెప్పిన పని చేయకపోతే భవిష్యత్తులో పరిణామాలు ఎదుర్కోక తప్పదని డీఈఓలు హెచ్చరించడంతో గత్యంతర లేక టీచర్లంతా బస్సు సూపర్ వైజర్లుగా పనిచేశారు.
టీచర్ల ఆరోపణను ఖండించిన ఆప్…
ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం టీచర్ల వాదనను ఖండిస్తోంది. టీచర్లను బస్సు సూపర్ వైజర్లుగా పెట్టలేదని.. స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్ ప్రారంభోత్సవానికి టీచర్లను పిలిచామని.. కొంతమంది వచ్చారని చెబుతోంది. కాకపోతే ఆప్ అబద్ధం చెబుతోందని ఏ బస్సును చూసినా అర్థమవుతుంది.