ప్రధాని మోదీ అభిమానించే ఆ రాష్ట్రం…

నరేంద్ర మోదీకి తన స్వరాష్ట్రం గుజరాత్ అంటే ఎంత ఇష్టమో.. దేశంలోని ఇతర ప్రాంతాలంటే అంతే అభిమానం. ప్రాంతీయ సమగ్రాభివృద్ధిపై బీజేపీ నేతలంతా దృష్టి పెట్టాలని, అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలని మోదీ చెబుతుంటారు. ప్రతీ ప్రాంతానికి అవసరమైన నిధులను విడుదల చేసే విధంగా మోదీ కేంద్ర ఆర్థిక శాఖపై ఎప్పుడూ వత్తిడి పెడుతుంటారు. ఐనప్పటికీ మధ్యప్రదేశ్ అంటే మోదీకి ప్రత్యేకమైన అభిమానం ఉందని, వీలైనప్పుడల్లా తమ రాష్ట్రానికి వస్తుంటారని ఆ రాష్ట్ర నేతలు, ప్రజలు గర్వంగా చెబుతుంటారు.

మధ్యప్రదేశ్లో 34వ పర్యటన

మోదీ ప్రధాని అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 34 సార్లు మధ్యప్రదేశ్లో పర్యటించారు. దేశానికి గుండెకాయగా భావించే రాష్ట్రమంటే మోదీకి చాలా ఇష్టమని అక్కడి నేతలు చెబుతుంటారు. ఇవాళ బీనా ప్రాంతానికి వచ్చారు. పది ప్రాజెక్టులకు నేరుగానూ, వర్చువల్ గానూ శంకుస్థాపన చేశారు. నర్మదాపురం జిల్లాలో పునరుత్పాదక విద్యుత్ వనరుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాట్లంలో మెగా పారిశ్రామిక పార్కును ప్రారంభించారు. మొత్తం ఆరు పారిశ్రామిక కేంద్రాలు మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి . షాజాపూర్, గుణ, మావ్ గంజ్, అగర్ మాల్వా, నర్మదాపూర్, మాస్కీలో ఈ పారిశ్రామిక పార్కులున్నాయి.

ఈ ఏడాది ఏడో సారి..

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ప్రధాని మోదీ అత్యంత ఇష్టమైన నాయకుడు. మోదీకి కూడా శివరాజ్ పనితీరు పట్ల పూర్తి విశ్వాసం ఉంది. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచినా మోదీ ఠక్కున మధ్యప్రదేశ్ వచ్చేస్తారు. ఈ ఏడాది ఆయన ఏడో సారి మధ్యభారతంలో ఉన్న కీలక రాష్ట్రానికి వచ్చారు..జనవరి 9న ఇండోర్ వచ్చినప్పుడు ప్రవాస భారతీ దివస్ కార్యక్రమంలో పాల్గొని.. ఎన్ఆర్ఐల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను స్వయంగా వివరించారు. ఏప్రిల్ 1న భోపాల్ – ఢిల్లీ వందే భారత్ రైలును ప్రారంభించారు. తర్వాత మరో రెండు రైళ్లు కూడా మధ్యప్రదేశ్లోనే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 24న రేవాలో, జూన్ 27న భోపాల్ లో పర్యటించారు. భోపాల్ లోనే రెండు వందే భారత్ రైళ్ల ఇనాగరేషన్ జరిగింది. జూలై 1న షాదోల్ లో పర్యటిస్తూ అనేక ప్రారంభోత్సవాలతో పాటు ఆయుష్మాన్ కార్జులను కూడా పంపిణీ చేశారు. ఆగస్టు 12న సాగర్ లో సంత్ రవిదాస్ ఆలయానికి శంకుస్థాపన చేశారు.

మోదీ ఇమేజ్ తో ఎన్నికలకు…

మధ్యప్రదేశ్ బీజేపీ ఇప్పుడు స్థానిక నాయకత్వం కంటే మోదీపైనే ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకుంది. మోదీని క్యాంపైన ఐడల్ గా పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసి ఒకటి రెండు రోజుల్లో రెండో జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో… మోదీ ఇమేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని నిర్ణయించినట్లు బీజేపీ పెద్దలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలకు మోదీ పట్ల ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని, అప్పుడు విజయావకాశాలు మెరుగు పడతాయని బీజేపీ నేతలు అంటున్నారు.