టీఆర్ఎస్ లిస్ట్ అంతా ఉత్తదేనా – అభ్యర్థులకు అందని కనీస సహకారం !

అభ్యర్థుల జాబితాను ప్రకటించారు కానీ వారే అభ్యర్థులు అవుతారన్న సంకేతాలను మాత్రం చాలా బలహీనంగా ఇస్తున్నారు కేసీఆర్. చాలా నియోజకవర్గాల్లో మళ్లీ సర్వేలు చేయిస్తున్నారు. ఈ విషయాలు లీక్ చేస్తున్నారు. అభ్యర్థులపై వ్యతిరేకత ప్రభుత్వం పుట్టి ముంచుతుందని జరుగుతున్న ప్రచారంతో.. కేసీఆర్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అసంతృప్తులు పార్టీ మారకుండా కూడా.. ముందస్తు ప్లాన్ గా… ఇంకా చాలా మందికి అభ్యర్థిత్వాలు అధికారికంగా ఖరారు చేయలేదన్న సంకేతాలు పంపుతున్నారు.

అది ఉత్తుత్తి లిస్టే

మామూలుగా అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ పూర్తి సామాగ్రితో సహకారం అందిస్తారు. ఇప్పటి వరకూ ప్రకటించిన వారికి అలాంటి సమాచారం ఏమీ అందలేదు. భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలో మెరుపులేం లేవు. కానీ మరకలు పడిన నేతలందరికీ జాబితాలో చోటు దొరికింది. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్ టీం సర్వేలు చేసినప్పుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పుకున్నారు. యాభై మందిని మారుస్తారని లీకులు వచ్చాయి. చివరికి ఏడుగురి విషయంలోనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ఏడుగురు కూడా తిరగబడేవారు కాదు.. కనీసం బలమైన వాళ్లు కాదు. వారిని మార్చినా మార్చపోయినా పోయేదేం లేదు. మరి కేసీఆర్ తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. కానీ ఇదంతా వ్యూహత్మకమని ఎన్నికలకు అసలు జాబితా ఉంటుందన్న ప్రచారం అందుకే జరుగుతోంది.

పరిస్థితిని బట్టి మార్చుతామని ముందుగానే ప్రకటన

పరిస్థితిని బట్టి కొంత మంది అభ్యర్థుల్ని మార్చుతామని కేసీఆల్ లిస్టు ప్రకటన సమయంలో తేల్చేశారు. దీంతో ఇదంతా ఉత్తుత్తి జాబితానేనని.. అసలు జాబితా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక విడుదల చేస్తారన్నప్రచారం ఊపందుకుంది . బండి సంజయ్ కూడా అదే ప్రకటించారు.. ప్రకటించిన వారిలో సగం మందికి టిక్కెట్లు ఇవ్వరని చెప్పేశారు. బీఆర్ఎస్ నేతల్లోనూ అదే అనుమానం ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి 30కిపైగా నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేస్తున్నారు. తర్వాత వాటి సంగతి పెరగవచ్చని అంటున్నారు.

కేటీఆర్ కూడా అదే చెబుతున్నారు !

కేటీఆర్ … అమెరికా పర్యటన నుంచి వచ్చారు. ఆ తర్వాత కొన్ని అభ్యర్థిత్వాలపై అసలు కసరత్తు ప్రారంభమయింది. ప్రస్తుతానికి పార్టీ నేతలెవరికీ కేసీఆర్ వద్ద యాక్సెస్ లేదు. కేటీఆర్ వద్దకు మాత్రమే యాక్సెస్ ఉంది. వారికి తమ వినతులు, విజ్ఞప్తులు చెప్పుకుంటున్నారు. అందుకే ఇప్పుడు టిక్కెట్ల సర్కస్ స్టార్ట్ అయింది. ఎన్నికలు ఆలస్యమవుతాయని కేటీఆర్ చేసిన ప్రకటన కూడా… సొంత పార్టీ నేతలు వెనక్కి తగ్గేలా చేయడానికేనన్న వాదన వినిపిస్తోంది.