సరిహద్దుల్లో వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు –

దేశ సరిహద్దుల్లో శత్రువులు పొంచి ఉన్నారు. పాకిస్థాన్, చైనా కాచుకు కూర్చున్నాయి. గాల్వన్ దాడి తర్వాత భారత రక్షణ శాఖ అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనా సైనికులను అనేక సార్లు తరిమికొట్టినా వారిలో మార్పు రావడం లేదని గుర్తించి.. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన సైనికులను తరలించేందుకు చర్యలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోని పాకిస్థాన్ కు ఎప్పటికప్పుడు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో సైనికుల తరలింపుకు అవసరమైన చర్యలు చేపట్టారు..

90 మౌలిక ప్రాజెక్టులు ప్రారంభం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు దేశ భద్రతను సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు 90 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నెచీపూ సొరంగ మార్గాన్ని ఆధునీకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతానికి ఆల్ వెదర్ కనెక్టివిటీ సాధ్యపడింది. అలాగే తూర్పు లద్దాక్ లోని నయోమా ప్రాంతంలో కీలక సైనిక లఘు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 11 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మహర్దశ లభించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత సేనల కదలికలను వేగం పెంచేందుకు ఈ ప్రాజెక్టులు దోహద పడతాయి.

సైనిక దళాలకు వెన్నుదన్నుగా…

జమ్మూ కశ్మీర్లోని సాంబా సెక్టార్లో పర్యటనకు వెళ్లిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.. వర్చువల్ గా ఆ ప్రాజెక్టులను ప్రారంభించారు. తూర్పు లద్దాక్ లో నయోమా ఎయిర్ ఫీల్జ్ ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.నిజానికి గత మూడేళ్లుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు తూర్పు లద్దాక్ లో భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. తాజా ప్రాజెక్టుల్లో 11 జమ్మూకశ్మీర్, ఐదు మిజోరం, మూడు హిమాచల్ ప్రదేశ్, రెండు ఉత్తరాఖండ్, పది పశ్చిమ బెంగాల్ లో ఉన్నాయి. రాజస్థాన్, అండమాన్ – నికోబార్ దీవుల్లో కూడా ప్రాజెక్టులను ప్రారంభించారు.

రూ.2,900 కోట్ల వ్యయం

పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు ఎయిర్ ఫీల్డ్స్ లద్దాక్ కు సైనికుల తరలింపు దిశగా ప్రయోజనం కలిగిస్తాయని భావిస్తున్నారు. తాజా ప్రాజెక్టుల్లో భాగంగా రెండు హెలీప్యాడ్స్, 22 రోడ్లు, 63 వంతెనల నిర్మాణానికి ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేశాయి. ప్రస్తుతం వేసవిలో మాత్రమే వ్యూహాత్మక తవాంగ్ సెక్టార్లోకి వెళ్లేందుకు కెనెక్టివిటీ ఉండేది. ఇకపై 500 మీటర్ల నెచీపూ సొరంగ మార్గం వల్ల ఏడాది పొడవునా తవాంగ్ వెళ్లే అవకాశం ఉంది. ఆ ప్రాంతం వాస్తవాధీన రేఖ వెంబడి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మపుత్ర పీఠభూములుతో పాటు అసోంలోని తేజ్ పూర్ ప్రాంతానికి దగ్గర దారిగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. మరో పక్క ప్రపంచంలోనే ఎత్తైన టన్నెల్ షింకూలా పనులను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ త్వరలో పూర్తి చేస్తుందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 15 వేల 855 మీటర్ల ఎత్తులో అది హిమాచల్ ప్రదేశ్ ను లద్దాక్ ను అనుసంధానం చేస్తుంది.