మహారాష్ట్రను తరచూ కుదివేసే మరాఠా రిజర్వేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలన్న ఉద్యమం ఊపందుకోవడం అందులోనూ మనోజ్ జారంగే పాటిల్ ఆమరణ దీక్ష చేయడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. నిజానికి రిజర్వేషన్ కు బీజేపీ కట్టుబడి ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు ఉత్తర్వులు, ఇతర సామాజిక వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన అనివార్యత ఉంది.
అఖిలపక్ష సమావేశంలో ఆమోదం…
మరాఠా రిజర్వేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. శివసేన షిండే వర్గానికి చెందిన మహారాష్ట్ర సీఎం ఎక్ నాథ్ షిండే, బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. మరాఠా రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నామని, నిరసనకారుల డిమాండ్లలో సహేతుకమైన వాటన్నింటినీ అమలు చేస్తామని సీఎం షిండే ప్రకటించారు. ఇతర కులాల రిజర్వేషన్ కు భంగం కలుగకుండా మహాఠా రిజర్వేషన్ అమలు చేస్తామని ఆయన తెలిపారు. పైగా హింసాత్మక ఘటనల్లో నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించాలని పోలీసు శాఖను ఆయన ఆదేశించారు. నిరసనకారులపై జరిగిన లాఠీ ఛార్జ్ కు ఆయన విచారం వ్యక్తం చేశారు.ఆమరణ దీక్ష చేస్తున్న మనోజ్ పాటిల్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. తక్షణమే దీక్ష విరమించాలని కోరారు. విపక్ష పార్టీలు కూడా మనోజ్ పాటిల్ దీక్ష విరమించాలని కోరాయి.
దీక్ష విరమించేది లేదు..
మరాఠా కోటా కోసం నిర్వహిస్తున్న దీక్షను విరమించేది లేదని మనోజ్ పాటిల్ ప్రకటించారు. రిజర్వేషన్ అమలయ్యే వరకు తన దీక్ష కొనసాగుతుందన్నారు. ఆర్డినెన్స్ లో మార్పులు చేస్తే రిజర్వేషన్ అమలుకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. తనను కలిసిన మంత్రుల బృందం వద్ద కూడా ఆయన ఇదే మాట అన్నారు.
30 శాతం మరాఠాలు
మహారాష్ట్రల్లో మరాఠా సామాజిక వర్గాలు దాదాపు 30 శాతం ఉన్నాయి. చాలా రోజులుగా ప్రత్యేక రిజర్వేషన్ కోరుతున్నాయి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోరా అని ప్రశ్నిస్తున్నారు. మరాఠాలకు ఓబీసీ కేటగిరిలో అవకాశాలు పొందేందుకు వీలుగా కున్బీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. దీనితో తమకు రిజర్వేషన్ తగ్గిపోతుందని ఓబీసీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.అందుకే ఓబీసీ రిజర్వేషన్ ను కదిలించకుండా మరాఠా రిజర్వేషన్ కల్పిస్తామని ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతానికి ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం, ఓబీసీలకు 32 శాతం, ఎస్సీలకు 13 శాతం, ఎస్టీలకు ఏడు శాతం మొత్తం కలిపి 62 శాతం రిజర్వేషన్ అమలులో ఉంది. చారిత్రకంగా యోధులుగా గుర్తింపు పొందిన మరాఠాలకు రిజర్వేషన్ చాలా కాలంగా కోరుతుండగా.. నిజానికి ప్రభుత్వం ఆ దిశగా అడుగుల వేసింది. అయితే రిజర్వేషన్ యాభై శాతం దాటకూడదని చెబుతూ సుప్రీం కోర్టు, మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. దానితో అప్పటి నుంచి మరాఠాలు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఇప్పుడిక తేల్చుకునే సమయం వచ్చిదని అంటూ… ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మహారాష్ట్ర కూడా మణిపూర్ తరహాలో తయారవుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.