ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ సెకెండ్ లిస్ట్ సిద్ధం

లోక్ సభ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జమిలీ ఎన్నికలు లేకపోతే ఐదు రాష్ట్రాల్లో ఈ డిసెంబరు నెలలో పోలింగ్ జరుగుతుంది. అందులోనూ మూడు ఉత్తరాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మధ్యప్రదేశ్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని, ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్లో గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో ఇతర పార్టీల కంటే ముందే పావులు కదుపుతోంది.

ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర నేతలు

బీజేపీ ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మధ్యప్రదేశ్లో 39, ఛత్తీస్ గఢ్ లో 21 మంది జాబితా విడుదలైంది. రెండో విడత జాబితాను ఫైనలైజ్ చేసే దిశగా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం సమావేశమవుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీడీ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హితానంద్ శర్మ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్ని రెండో దశ అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేయించుకుంటారు. ఎన్నికలకు బాగా ముందుగా ప్రచారాన్ని ఊపందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రంగంలోకి ప్రధాని మోదీ..

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 వార్షిక శిఖరాగ్ర సదస్సు తర్వాత ప్రధాని మోదీ కొంచెం రిలాక్స్ గా ఉన్నారు. ఇప్పుడాయన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటో ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని పరిశీలించి, తగిన అభ్యర్థులను ఎంపిక చేయాలని మోదీ సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని నిర్థారణ జరిగిన నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది.