ఖరీదైన ఎస్.యూ.వీ కార్లు, హెలికాప్టర్లు, వెంట వందల మంది అనుచరులు, కోట్లాది రూపాయలు వెదజల్లడం.. ఇదీ కాంగ్రెస్ పార్టీ నేర్పిన పొలిటికల్ కల్చర్. డబ్బులివ్వనిదే జనం ఓట్లెయ్యరని, క్యాష్ పెట్టకుండా ఓట్లెయ్యకూడదని అలవాటు చేసినది కూడా కాంగ్రెస్ పార్టీనేనని చెప్పాలి. బీజేపీ బాగా లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఆ కల్చర్ ను వల్చర్లకు వేసి.. నిజాయితీగా రాజకీయాలు చేయడం అలవాటు చేసుకున్నారు. నిస్వార్థంగా సేవ చేసే స్వార్థ త్యాగులు పార్టీలోకి వస్తున్నారు. ఏడాదికి కోటి కోటిన్నర జీతాన్ని సైతం వదులుకుని పేదలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్న వాళ్లంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. అందులో రాజస్థాన్ రాష్ట్రంలోని రాజా ఖేరాలో ఇంటింటికి తిరుగుతున్న మాళవికా ముగ్ధల్ కూడా ఒకరు….
సామాజిక స్పృహతో సేవచేస్తున్న మాళవికా ముగ్ధల్
ఆమె ఎలీ లిల్లీ, కార్గిల్ సీడ్స్, హిటాచీ కార్పొరేషన్ లాంటి మేటి సంస్థల్లో పనిచేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివారు. ఏయిర్ కండీషన్డ్ ఆఫీసుల్లో కూర్చున్నారు. ఇప్పుడు రాజస్థాన్ ఎండల్లో తిరుగుతూ ప్రజా సేవలో తరిస్తున్నారు. రాజాఖేరా ప్రాంతంలో ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతోంది. కోట్ల ఆదాయం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమె ప్రజాసేవకు అంకితమయ్యారు. దేశ రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజా ఖేరా ప్రాంతంలో 2 లక్షల మంది ఓటర్లుండే మెజార్టీ వర్గం పేద, అల్పాదాయ బడుగు జీవులు. శిథిలమైన గడిసెలు, పూట గడవని బతుకులను ఈడ్చుకుంటూ వస్తున్న పేదలను ఎలా ఆదుకోవాలో మాళవిక అధ్యయనం చేస్తూ వారికి కావాల్సిన సాయం అందిస్తున్నారు.
సైకిల్, స్కూటర్ పై తిరుగుతూ…
మాళవిక కారులో రారు. వీలైతే స్కటర్ లేకపోతే సైకిల్ లో తిరుగుతూ ఆమె ఛంబల్ వ్యాలీ అంతా చుట్టి వస్తున్నారు. రాజా ఖేరా ప్రాంతం బందిపోట్లకు నిలయమైన ఛంబల్ లోయలో ఉంటుంది. నిన్నటి డెకాయిట్ల జీవిత చరిత్రతో తనకు సంబంధం లేదని, పేద ప్రజలను ఆదుకునే స్కీములే తనకు ముఖ్యమని మాళవిక చెబుతారు. రాజా ఖేరా కనీస వసతులకు నోచుకోలేదు. పాఠశాలలు, వైద్యశాలలు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఆమె తన వంతు కృషి చేస్తున్నారు.గ్రామాల్లో మంచినీటి పైపులు ఏర్పాటు చేయడం, సాయంత్రం పూట కనీసం ఆరు గంటల పాటు కరెంట్ ఉండే విధంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడాన్ని ఆమె సొంత పనిగా చేపట్టారు. మాళవిక వచ్చారంటే ఊళ్లోని మహిళలంతా ఆమె చుట్టూ చేరుతున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటే తప్పకుండా తీరుతాయన్న విశ్వాసం వారిలో కలుగుతోంది. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎండలో నిల్చున్న మహిళలను చూసి మాళవిక చలించి పోతున్నారు . ఇప్పటికే 46 పంచాయతీల్లో ఆమె తాగునీరు, వీధి దీపాలు, కరెంట్ వసతికి కావాల్సిన సేవలు అందించారు..
రాజకీయాల్లో మాళవిక తండ్రి
మాళవిక తండ్రి అశోక్ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి బీజేపీ ఆశావహుల్లో మాళవిక కూడా ఉన్నారు. అలాగని ఆమె టికెట్ వచ్చి తీరాల్సిందేనని కూడా కోరుకోవడం లేదు. వస్తే మంచిదే మరింతగా ప్రజా సేవకు ఉపయోగపడుతుందని ఆమె అంటారు. లేకపోయినా తన ప్రజాసేవ కొనసాగుతుందన్నది మాళవిక లెక్క. పితృస్వామిక వ్యవస్థలో మహిళలు పడుతున్న బాధలను కొంతైనా తీర్చాలన్నది ఆమె లక్ష్యం. అలాగని ఆమెది విప్లవ మార్గం కాదు. కుటుంబానికి కనీస వసతులు లేకపోయినా పురుషులు పట్టించుకోకుండా తిరుగుతున్న నేపథ్యంలో మహిళలు పడుతున్న బాధలు అర్థం చేసుకుని వారికి సాయపడటమే తన కర్తవ్యమంటారు. కరెంట్ లేని, వంట గ్యాస్ లేని ఇళ్లను,కాళ్లకు చెప్పులు, ఒంటి నిండా బట్టలు లేని మహిళలను ఇంకెన్నాళ్లు చూడాలని ఆమె ప్రశ్నిస్తారు. అదీ సహేతుకమైన ప్రశ్నే కదా…