సాఫ్ట్ గా ఉన్నాడనుకోవద్దు.. వార్నింగ్ ఇస్తే అదిరిపోద్ది….

ప్రధాని మోదీ.. ప్రత్యర్థులకు సైతం గౌరవం ఇవ్వాలనుకునే మర్యాదస్తుడైన నాయకుడు. విదేశీ నేతలను స్వయంగా వెళ్లి ఆహ్వానించానకునే నాయకుడు. అందరినీ కలుపుకుపోయి ప్రపంచ శాంతికి పనిచేయాలనుకునే ధీరుడు. గీత దాటితే మాత్రం ఎవరికైనా గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడరు…

కెనడా జరుగుతున్నదేమిటి – నిలదీసిన మోదీ

కెనడాలో భారత వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయ్. ఖలిస్థాన్ పేరుతో సిక్కు వేర్పాటువాద గ్రూపులు అక్కడ హల్ చల్ చేస్తున్నాయి. భారత రాయబార కార్యాలయం దగ్గర నిరసన ప్రదర్శనలతో పాటు హింసకు దిగుతున్నాయి. జీ-20 సదస్సుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దగ్గర మోదీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కెనడాలో భారత వ్యతిరేక ప్రదర్శనలు ముమ్మాటికి సహేతుకం కాదని అన్నారు. అతివాద శక్తులు ఇష్టానుసారం ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదంటూ దాదాపుగా హెచ్చరిక జారీ చేశారు. వేర్పాటువాద ముసుగులో డ్రగ్స్ దందా, మానవ అక్రమ రవాణాకు తెరతీశారని భారత అధికారులు కెనడా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.పైగా కెనడాలో ఓ ప్రభుత్వం ఉండగా సిక్కులు విడిగా రెఫరెండం ఎలా నిర్వహిస్తారని భారత ప్రభుత్వం నిలదీస్తే కెనడా పెద్దలు నీళ్లు నమిలారు. ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం బయట కొందరు సిక్కులు చేసిన యాగీని దేశంపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పింది.

వేర్పాటువాదులను అడ్డుకోవడం లేదు..

భారత్ దేశంపై విషం జిమ్ముతున్న వేర్పాటువాద శక్తులను కెనడా ప్రభుత్వం అడ్డుకోవడం లేదని మోదీ ప్రభుత్వం ఆక్షేపించింది. భారత్ ఎప్పుడు ఇతరుల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోలేదని, ఇతరులు కూడా అదే వైఖరి పాటించాలని ఆకాంక్షిస్తోందని గుర్తుచేశారు. దానితో దిగివచ్చిన కెనడా ప్రభుత్వం తాము ఎన్నడూ హింసను ప్రేరేపించే ప్రసక్తేలేదని ప్రకటించింది. దేశంలో శాంతియుత నిరసనలకు అవకాశం ఉన్నప్పటికీ హింసను ప్రేరేపించే వారిని మాత్రం ఉపేక్షించబోమని చెప్పుకుంది..

ఢిల్లీ డిక్లరేషన్ వెనుక వారి బ్రెయిన్

జీ-20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదింపజేసేందుకు ప్రధాని మోదీ కీలక భూమిక పోషించారు. ఉక్రెయిన్ – రష్యా వ్యవహారంలో ఇతరులను ఒప్పించడానికి అనేక దఫాలు చర్చలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు మోదీ టీమ్ లోని విదేశాంగ అధికారులు ప్రత్యేక చొరప చూపారు. ఇండియన్ షెర్పా అమితాబ్ కాంత్ కు అభయ్ ఠాకూర్, అశీష్ సిన్హా, ఇనం గంభీర్ తో పాటు తెలుగువారైన నాగరాజ నాయుడు అహరహం సహాయ సహకారాలు అందించారు. కె.నాగరాజ్‌ నాయుడు 1998 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్‌ అధికారి. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్లో 1990లో పాఠశాల చదువును నాగరాజ్‌ పూర్తి చేశారు. 1995లో నిజాం కాలేజీలో డిగ్రీ చదివి, 1998లో ఐఎఫ్ఎసకు ఎంపికయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దును పాకిస్థాన్‌, చైనా అంతర్జాతీయ వివాదంగా మలిచేందుకు చేసిన ప్రయత్నాలను ఆయన బలంగా తిప్పికొట్టారు. నాగరాజ్‌ నాయుడు చైనాలో నాలుగు పర్యాయాలు భారత దౌత్య అధికారిగా పనిచేశారు. చైనా భాష మాండరిన్ ఆయనకు కొట్టిన పిండి అనే చెప్పాలి.