మీకు ఈ సమస్యలుంటే అప్రమత్తం అవండి..లేదంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం!

ప్ర‌స్తుత రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో గుండె జ‌బ్బులు ప్రధానంగా మారాయి. గుండె పోటుతో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు ప్రధానకారణం దినచర్య, మారుతున్న అలవాట్లే అంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం..

శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు మాత్ర‌మే గుండె ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయ‌ని చాలా మంది అనుకుంటారు. ఇది నిజమే అయినప్పటికీ ఇతర కారణాల వ‌ల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది.

నిద్రలేమి ప్రధాన కారణం
గుండె జ‌బ్బుల‌కు కార‌ణ‌మ‌య్యే వాటిలో నిద్రలేమి అగ్ర‌స్థానంలో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. దీంతో శ‌రీరానికి త‌గినంత విశ్రాంతి ల‌భించ‌డంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

మోనోపాజ్ దశలో ఈ ప్రమాదం ఎక్కువ
మోనోపాజ్ ద‌శ‌లో ఉండే స్త్రీల‌ల్లో కూడా గుండె పోటు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. స్త్రీల‌ల్లో ఉండే హార్మోన్ల‌లల్లో ఈస్ట్రోజ‌న్ ఒక‌టి. ఇది ధ‌మ‌నులల్లో ర‌క్త‌స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డంలో దోహ‌ద‌పడుతుంది. అదే మోనోపాజ్ ద‌శ‌లో ఉండే స్త్రీల‌ల్లో ఈస్ట్రోజ‌న్ త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీని వ‌ల్ల ధ‌మ‌నులు గ‌ట్టి పడి గుండెపోటు వ‌చ్చే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.

దంతాలు ఆరోగ్యంగా లేకపోయినా సమస్యే
దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా మన గుండె ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దంతాల‌్లో, చిగుళ్లల్లో ఉండే బ్యాక్టీరియాలు ర‌క్తం ద్వారా ప్ర‌వ‌హించి గుండెకు చేరుతాయి. ఈ బ్యాక్టీరియాలు గుండె క‌ణ‌జాలాన్ని, కండ‌రాల‌ను మ‌రింత దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంది. అందుకే నోటి ఆరోగ్యాన్ని ఎప్పుడూ ప‌రిర‌క్షించుకోవాలి.

అధిక ఒత్తిడి తగదు
అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, డిఫ్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం, హృదయ స్పంద‌న‌లల్లో మార్పులు రావ‌డం జ‌రుగుతుంది. దీంతో గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

నైట్ షిప్ట్ పెద్ద ఎఫెక్టే
ఇప్పుడున్న ఉద్యోగులలో సగానికి సగం మంది రాత్రి వేళల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో జీవనవిధానం మొత్తం మారిపోతుంది. ఇది కూడా గుండె ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్ర‌భావాన్ని చూపిస్తాయి. అందుకే నైట్ షిప్ట్ లో ప‌ని చేసే వారు త‌ర‌చూ గుండెకు సంబంధించిన ప‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాలి.

ట్రాఫిక్ జామ్ వల్లకూడా గుండెపోటు
ట్రాఫిక్ జామ్ ల వ‌ల్ల కూడా గుండెపోటు వ‌చ్చే అక‌వాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఒత్తిడి, వాహ‌నాల ధ్వ‌నులు, గంట‌ల కొద్ది ట్రాపిక్ లో చిక్కుకుపోవ‌డం వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక ట్రాఫిక్ లో చిక్కుకున్న వారు విలీనైంత ప్ర‌శాంతంగా ఉండాలి. న‌చ్చిన సంగీతాన్ని, పాట‌ల‌ను వినాలి.

రోజువారి జీవితంలో కొంత సమంయ ప్రత్యేకంగా కేటాయించుకోవాలి, నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, క్రీడలపై ఆసక్తి ఉండేవారు ఆడుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మాత్రమే కాదు ఇంకెలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని సూచిస్తున్నారు నిపుణులు

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.