పాపాలను కడిగేసే గంగమ్మ పాపవిమోచనాన్ని పొందిన క్షేత్రం, కోరిన కోర్కెలు తీర్చే వేణుగోపాల స్వామి వెలసిన పుణ్యక్షేత్రం, దేవతలు స్వయంగా నిర్మించిన ఆలయం ఇది. కృష్ణాజిల్లా హంసలదీవిలో ఉన్న ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది…
మహారాష్ట్రలో జన్మించి వేల కిలోమీటర్లు ప్రయాణించే కృష్ణమ్మలో ఓ పాయ కోడూరు మండలం హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. నది -సముద్రం సంగమంలో స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలూ నశిస్తాయని చెబుతోంది శాస్త్రం. కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే అలాంటి పవిత్ర స్థలానే రుక్ష్మిణీ సమేతంగా వేణుగోపాల స్వామి కొలువయ్యాడు. దేవతలు పుణ్యస్నానాలు ఆచరించి..వేణుగోపాలుడి ఆలయాన్ని ఒక్కరాత్రిలో నిర్మించారని చెబుతారు. నిర్మాణం పూర్తయ్యే సమయంలో కోడికూసే వేళ ఓ వ్యక్తి చూడడంతో దేవతలంతా శిలలుగా మారిపోయారని అక్కడ శిల్పాలుగా ఉన్న దేవతావిగ్రహాలు అనేనని చెబుతారు. కొన్నేళ్ల క్రితం వరకూ అసంపూర్తిగా మిగిలిపోయిన రాజగోపురమే ఇందుకు సాక్ష్యం అని చెప్పేవారు. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా కల్యాణోత్సవాలు కన్నులపండువగా జురుగుతాయి.
దేవలిపి
ఆలయం లోపల స్తంభాలపై రాసి ఉన్న లిపి ఏంటన్నది పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకోలేక పోవడంతో అది దేవలిపేనని అక్కడి వారు చెబుతారు. సంతానం లేని వారు ఇక్కడి స్వామికి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. అందుకే సంతాన వేణుగోపాలస్వామిగా ప్రసిద్ధి చెందాడు.
హంసలదీవి అనే పేరు ఎలా వచ్చిందంటే
ప్రజలంతా పాప ప్రక్షాళన కోసం గంగానదిలో స్నానమాచరిస్తుంటే ఆ పాప భారాన్ని మోయలేక గంగమ్మ.. శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకుంది. ‘పాపానికి ప్రతీకైన నలుపు రంగును ధరించి కాకి రూపంలో పుణ్యనదుల్లో స్నానమాచరించు..ఎక్కడైతే నీ నలుపు రంగు పోయి, తెలుపు రంగు వస్తుందో అక్కడితో నీకు పాపవిముక్తి లభిస్తుంది’అని వరమిస్తాడు విష్ణువు. దీంతో కాకిరూపం దాల్చిన గంగమ్మ పుణ్యనదుల్లో స్నానమాచరిస్తూ హంసలదీవి సాగరసంగమంలో మునగగానే నలుపు రంగు మాయమై తెల్లటి హంసలా మారిపోయిందట. అందుకే ఈప్రాంతానికి హంసల దీవి అని పేరొచ్చిందని పురాణగాథ.
మాఘ పౌర్ణమి ప్రత్యేకం
మాఘపౌర్ణమి రోజు సముద్ర స్నానమాచరిస్తే సర్వపాపాలూ పోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆ రోజు రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చి లక్షల మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అదే రోజు స్వామికి ఘనంగా చక్రస్నాన కార్యక్రమం నిర్వహిస్తారు. రథోత్సవం,ప్రత్యేక పూజలు చేస్తారు. కృష్ణాష్టమి, కార్తీకమాసం, ధనుర్మాసంలో నెలరోజులూ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.