భక్త సంరాక్షణార్ధం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలు. దశావతారాల్లో మూడవది ఆది వరాహావతారం. ఈ దశావతారాల్లో ఒక్కరైన భూ వరాహ స్వామి ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో హేమావతి నది ఒడ్డున కల్లహల్లి గ్రామంలో ఉన్న భూ వరాహస్వామి ఆలయం గురించి ఆసక్తికర కథనం
భూ వరాహస్వామి ఆలయం 2500 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెబుతారు. గౌతమ మహర్షి తపస్సు ఆచరించిన పుణ్య ప్రదేశంగా చెబుతారు. పురాణాల ప్రకారం..రాజు వీర బల్లాల వేటకు వెళ్లి ఈ అడవుల్లో తప్పిపోయాడు. అప్పుడు ఒక పెద్ద చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక కుందేలును వెంబడిస్తున్న వేట కుక్కను చూశాడు. వారు ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నప్పుడు, కుందేలు వెనక్కి తిరిగి భయంకరమైన కుక్కను వెంబడించడం ప్రారంభించింది. ఈ విచిత్రమైన పరిణామాన్ని గమనించిన రాజుకు ఆ ప్రదేశంలో కొన్ని కనిపించని శక్తులు ఉన్నాయని నమ్మించాడు. ఈ మొత్తం ప్రాంతాన్ని తవ్వి భూమి పొరల క్రింద దాగి ఉన్న ప్రళయ వరాహస్వామిని కనుగొన్నాడు. రాజు దానిని ఆలయంలో ప్రతిష్టించి నిత్య ప్రార్థనలు చేశాడు. కొన్నేళ్లపాటూ శిథిలావస్థలో ఉండిపోయిన ఆలయాన్ని బెంగళూరికి చెందిన చంద్రశేఖర్ అనే భక్తులు పునర్నిర్మించాడు.
భూ వరాహమూర్తిని పూజిస్తే సొంతింటి కల నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఆలయంలో మట్టికీ, ఇటుకలకూ పూజల్ని నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుక్కోవాలనుకునేవారికి ఆలయ నిర్వాహకులు.. మృతికా పూజను నిర్వహిస్తారు. ఒకవేళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రయత్నంలో ఉన్నవారు ఇటుకలకు పూజలు చేయించుకుంటారు. అందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోనే మట్టీ, ఇటుకలూ ఉంటాయి. ఆ పూజల అనంతరం మట్టి లేదా ఇటుకల్ని తమతో ఇళ్లకు తీసుకెళ్లి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ఏ ఆటంకం లేకుండా ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెబుతారు.
ఈ ఆలయంలో పక్కన హేమావతి నది ఉంది. ఈ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈత కొట్టడం, పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉండదు. ఏప్రిల్, మేలో నీరు తగ్గిన తరువాత వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పాండవపుర రైల్వేస్టేషన్లో నుంచి, మైసూర్ నుంచి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు అందుటుబాటులో ఉంటాయి.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.