కడప నుంచి ఫ్యామిలీ కోటాలో టిక్కెట్ – కష్టపడే వారిని చంద్రబాబు గుర్తించడం లేదా?

టీడీపీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఒత్తిళ్లకు గురవుతున్నట్లుగా కనిపిస్తోంది. కష్టపడేవారికే టిక్కెట్లని ఆయన చెప్పిన మాటలు అమల్లోకి రావడం లేదని నేతలు ఫీలవుతున్నారు. తాజాగా కడప ఇన్‌ఛార్జిగా ఆర్‌.మాధవిరెడ్డి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ బి.రామాంజనేయులను నియ మించారు. ఈ ఇద్దరి నియామకం టీడీపీలో తీవ్ర చర్చకు కారణం అవుతోంది.

రెడ్డప్పగారి కుటుంబానికే కడప టిక్కెట్

కడప ఇన్‌ఛార్జిగా మాధవి నియామకం చర్చనీ యాంశమైంది. కడప పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి ఆర్‌.శ్రీనివాస రెడ్డి, సతీమణి మాధవిని కడప అసెంబ్లీ బరిలో నిలపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. శ్రీనివాస రెడ్డి తండ్రి ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి గతంలో మంత్రిగా పని చేశారు. వైఎఎస్‌ఆర్‌ కుటుంబానికి వ్యతిరేకంగా కడపలో రాజకీయం నడిపారు. గతంలో కడప పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి పోటీ చేసి వైఎస్‌ఆర్‌ కుటుంబానికి ఎదురొడ్డారు. మరోసారి కూడా ఆయన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తన భార్య మాధవికి కడప అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై ఆయన ఒత్తిడి తెచ్చారు.

కార్పొరేటర్ గా గెలిచిన ఉమాదేవికి మొండి చేయి

వైసిపి మాత్రం ముస్లిం మైనార్టీకి టికెట్‌ను ఖరారు చేసింది. కడప నుంచి అంజాద్‌బాషా రెండుసార్లు గెలుపొందారు. రెండోసారి వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చోటు దక్కించుకున్నారు. మూడోసారి కూడా ఆయనే బరిలో ఉండనున్నారు. రానున్న ఎన్నికల్లో అంజాద్‌బాష, మాధవీరెడ్డి మధ్య గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కడప టికెట్‌ను టిడిపి ఏకైక కార్పొరేటర్‌ ఉమాదేవి ఆశించారు. అయితే టిడిపి అధిష్టానం మాత్రం మాధవి వైపు మొగ్గు చూపడం గమనార్హం.

ప్రత్తిపాడుతో సంబంధం లేని ఇంచార్జ్ రామాంజనేయులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి 2019 ఎన్నికల తర్వాత ఇంఛార్జ్ లేకుండా పోయారు. ఆ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.. అప్పటి నుంచి అక్కడ పార్టీ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు.. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయులను నియమించారు. ప్రత్తిపాడు నుంచి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామాంజనేయులుకు ప్రత్తిపాడుకు సంబంధం లేదు. అయినా నియమించారు. ఇతర నేతల బంధువు కావడం వల్లేనని టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.