ఎన్నికల పొత్తు దిశగా బీజేపీ, జేడీఎస్

రాజకీయ శక్తుల పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై విసిగిపోయిన పార్టీలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నాయి. ఇండియా కూటమి ఒంటెత్తు పోకడను వ్యతిరేకిస్తున్న కొన్ని పార్టీలు కమలనాథులతో చేతులు కలుపుతున్నాయి..

మారుతున్న కర్ణాటక రాజకీయం

కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించేది.కాంగ్రెస్ కు చేరువగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అసలు రంగు బయట పడటంతో జేడీఎస్ లో మార్పు వచ్చింది. ఇండియా కూటమి వైపు కూడా ఆ పార్టీ చూడటంలేదు.అధికారానికి వచ్చిందే తడవుగా అవినీతికి దిగిన కాంగ్రెస్ కు వీలైనంత త్వరగా బుద్ధి చెప్పాలని కుమారస్వామి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయేలోకి రావాలని బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, జేడీఎస్ కు విజ్ఞప్తి చేశారు. భావసారూప్యంగా కలిసి పనిచేద్దామని కోరారు. 2024 లోక్ సభ ఎన్నికలల్లో పొత్తుగా పోటీ చేసేందుకు ప్రతిపాదించారు.

మాండ్యా సీటుపై పీటముడి..

కర్ణాటకలో 28 లోక్ సభా స్థానాలున్నాయి. ఐదు స్థానాలు తమకు కేటాయిస్తే కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని జేడీఎస్ అంటూ బీజేపీ నేతలకు వర్తమానం పంపింది. అయితే నాలుగు స్థానాలు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఐదో స్థానం అడగవద్దని యడ్యూరప్ప బృందం చెబుతూ జేడీఎస్ ను సమాధానపరిచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే జేడీఎస్ కు కంచుకోటగా భావించే మాండ్యా స్థానంపై ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మాండ్యా తమకు కావాలని జేడీఎస్ అంటుండంగా, ఆ లోక్ సభా స్థానాన్ని వదిలే ప్రసక్తే లేదని బీజేపీ భీష్మించుకు కూర్చుంది. అయితే కుమారస్వామి మాత్రం విభేదాలు లేవని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వివాదాస్పద సీట్ల కింద టుమాకూరు, కోలార్ కూడా పరిగణించాల్సి వస్తుందని అసలు చర్చలు మొదలు కాకముందే మీడియా స్పెక్యులేషన్ చేస్తోందని ఆయన వాదిస్తున్నారు. 2024లో కూడా మాండ్యా నుంచి సుమలతను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు తనకు చేరలేదని కుమారస్వామి ప్రకటించారు.

కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం

బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతూనే జేడీఎస్ కార్యకర్తలను అందుకు సిద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. మాజీ ప్రధాని దేవెగౌడ ఈ దిశగా చర్యలు చేపట్టారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల ఆలోచనా విధానాన్ని తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ… పొత్తు కుదిరిన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు కలిసిపోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి.. నాలుగైదు స్థానాల్లో విజయవకాశాలుంటాయా లాంటి అంశాలపై జేడీఎస్ పెద్దలు దృష్టి పెట్టారు.