దేశాధినేతలు మెచ్చిన కరీంనగర్ కళ – జీ 20లో ఆకట్టుకున్న ప్రత్యేక స్టాల్

దేశాధినేతలు ఒక చోట సమావేశమయ్యే ఢిల్లీ జి -20 సమ్మిట్ లో తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్సులో 20 దేశాలకు చెందిన ప్రతినిధుల చొక్కాలకు బ్యాడ్జీలను కరీంనగర్‌ కు చెందిన కళాకారులే తయారు చేశారు. ఈ వర్క్‌ను ఫిలిగ్రీ వర్క్ అని పిలుస్తారు. కోణార్క్ సూర్యదేవాలయాన్ని పోలి ఉండేలా రథ చక్రం తరహాలో ఈ బ్యాడ్జీలను తయారు చేశారు.

కేంద్రం గుర్తించిన కరీంనగర్ ఫిలిగ్రీకళ

జి – 20 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రెండు వందల బ్యాడ్జీలను ఆర్డర్ ఇచ్చి చేయించింది. జి – 20 సమ్మిట్‌లో స్టాల్ ఎగ్జిబిషన్‌ నిర్వహించడానికి తెలంగాణకు చెందిన కళాకారులకు కూడా అనుమతి దక్కింది. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అశోక్ ఆధ్వర్యంలో ఈ స్టాల్ నిర్వహిస్తారు. జి – 20లో మొత్తానికి కరీంనగర్ కళాకారులకు చెందిన స్టాల్ కొనసాగనుంది.

గతంలోనూ ప్రత్యేక గుర్తింపు

కరీంనగర్ ఫిలిగ్రీ వర్క్ కు ఇంతటి అరుదైన గౌరవం దక్కడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా వీరికి గుర్తింపు లభించింది. అంతేకాక, దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు కొంత మందికి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది.

క్లిష్టమైన డిజైన్లు – అరుదైన ప్రతిభ

సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ అనేది ఒక అరుదైన కళ, అందులో వెండిని తీగలుగా చేసి క్లిష్టమైన డిజైన్లుగా మలుస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ పనిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులకు అప్పగించారు. నైపుణ్యం కలిగిన కళాకారులను ఎంపిక చేసి మొత్తం 200 అశోక చక్ర బ్యాడ్జ్‌ లను G20 ప్రతినిధుల సూట్‌లకు అలంకరించనున్నారు. సత్యం, ధర్మం, శాంతికి చిహ్నంగా అశోక చక్రం కాబట్టి వాటిని బ్యాడ్జ్ లను ప్రత్యేకంగా తయారుచేయించారు.