చంద్రబాబు అరెస్ట్ – లేనిపోని సానుభూతిని టీడీపీకి పెంచుతున్న వైసీపీ !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై రాజకీయంగా భిన్న చర్చ జరుగుతోంది. ఆయనపై అవినీతి కేసుల్లో సాక్ష్యాలు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే.. అసలు అరెస్ట్ చేసిన విధానమే ఏ మాత్రం సమంజసంగా లేదన్న అభిప్రాయంలో ఎక్కువ మంది ఉన్నారు. అర్థరాత్రి కొన్ని వందల మంది పోలీసుల్ని మోహరించి .. తెల్లవారుజామునే అరెస్ట్ చేయడం.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నరో కూడా చంద్రబాబుకు చెప్పకపోవడం వివాదాస్పదమయింది. ఆ వీడియోలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఏ కేసులో.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పబోమని పోలీసులు చెప్పడం వైరల్ అయింది.

అన్ని రాజకీయ పార్టీల సంఘిభావం

చంద్రబాబుకు అన్ని రాజకీయ పార్టీలు సంఘిభావం ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్ట్ చేశారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పవన్ కల్యాణఅ ప్రశ్నించారు. చంద్రబాబుకు నా సంపూర్ణ మద్దతు- ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్నారు. ఆయన చంద్రబాబుకు సంఘిభావం తెలిపేందుకు నేరుగా విజయవాడ వెళ్లారు. ఇక బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ప్రొసీజర్ పాటించకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. కమ్యూనిస్టు పార్టీలు.. కాంగ్రెస్ నేత తులసీరెడ్డి కూడా ఖండించారు.

ర్యాలీలా తీసుకొచ్చిన పోలీసులు

చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ర్యాలీలా చాలా చోట్ల తిప్పి తీసుకు వచ్చారు. ఇది ఆయా ప్రాంతాల్లో టీడీపీ బల ప్రదర్శనకు వాడుకుంది. చాలా చోట్ల పోలీసులు కాన్వాయ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. చంద్రబాబుపై సానుభూతి పెంచడానికి ఇదంతా చేసినట్లుగా మారిపోయింది. చంద్రబాబును అరెస్ట్ చేయాలనుకుంటే.. ఆయనకు ఇంత మైలేజీ ఇచ్చి అరెస్ట్ చేయడం ఎందుకని రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. హెలికాఫ్టర్ లో తీసుకుని వస్తే సమస్య ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది.

ప్రజల్లోనూ సానుభూతి వస్తే అధికార పార్టీకి నష్టమే.

చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకమైన కోపం ఏమైనా ఉంటే.. ఆయన అరెస్టును సమర్థిస్తారు కానీ.. రాజకీయాలో ముఖ్య నేతల అరెస్టులు అత్యధిక సార్లు మిస్ ఫైర్ అయ్యాయి. సీఎం జగన్ కూడా పదహారు నెలలు జైల్లో ఉన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తూ పాదయాత్ర చేశారు. ఇదంతా ఆయనకు సానుభూతి వచ్చేలా చేసిందని చెబుతారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ అదే జరిగితే.. కావాలని కష్టాలు తెచ్చుకున్నట్లేనన్న వాదన వినపిస్తోంది.