ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప సాంప్రదాయాలు హిందువులవే అని చెప్పకతప్పదు. ఎందుకంటే చెట్టును, పుట్టని, రాయిని, పర్వతాన్ని , నీటిని, అగ్నిని..ఇలా పంచభూతాల్లో ఇమిడిన ప్రతిదాన్ని పూజిస్తాం. నాస్తికులకు, మతవిశ్వాసం లేనివారికి ఇవి మూఢనమ్మకాలుగా కనిపించవచ్చు కానీ వీటి వెనుకున్న ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడే సనాతనధర్మం ప్రత్యేకత అర్థమవుతుంది. ఈ ధర్మాన్ని రక్షించేందుకే ఆలయ వ్యవస్థ ఉంది. పెద్ద పెద్ద క్షేత్రాల మొదలు చిన్నచిన్న ఆలయాల వరకూ దేనికదే ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకమైన ఆలయాల్లో ఒకటి నిముషాంబిక దేవి. ఈ అమ్మవారి ప్రత్యేకతేంటో తెలుసుకుందాం…
ప్రతి గ్రామంలో ఓ ఆలయం ఉంటుంది. ఆయా గ్రామాలకు రక్షణగా అమ్మవారు కొలువుతీరిందని భావిస్తారు భక్తులు. దుష్ట శక్తులను, హాని కలిగించే వ్యాధులను ఊరిలోకి రాకుండా కాపలాకాస్తూ ఊరిని కాపాడుతారని విశ్వాసం. ఇలాంటి ఆలయాల్లో ప్రత్యేకం నిమిషాంబిక. ఏ ఆలయానికి వెళ్లినా కష్టాలు తీరాలని, శుభం జరగాలని కోరుకుంటారు, ముడుపులు చెల్లిస్తారు. అయితే కోరిన కోర్కెలు తీరడానికి సమయం పడుతుంది కానీ ఈ ఆలయంలో ఏం భక్తి శ్రద్ధలతో ఏం కోరుకున్నా నిముషాల్లో తీరిపోతుందంటారు. కర్ణాటకలోని శ్రీరంగం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం గ్రామంలో ఈ ఆలయం ఉంది.
స్థలపురాణం
పురాణాల ప్రకారం ముక్తకుడు అనే రుషి లోక కల్యాణార్థం యాగాన్ని తలపెట్టారు. ఆ యాగం జరగకుండా రాక్షసుడు అడ్డుపడ్డారు. ఆ రాక్షసులను అంతమొందించడానికి చాలా ప్రయత్నాలు చేసారు ఋషులు. ఈ విధంగా ముక్తక ఋషి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ రాక్షసుల ఆగడాలను అంతమొందించ లేకపోయాడు. ఆసమయంలో పార్వతీదేవి యజ్ఞ కుండంలో నుంచి ఉద్భవించి రాక్షసులను సంహరించింది. అప్పటి నుంచీ అక్కడ పార్వతీ దేవిని నిముషా దేవిగా పిలుస్తారు. ఒడయార్లనే రాజులు శ్రీ రంగపట్నంను రాజధానిగా చేసుకొని పాలన సాగించగా 400 సంవత్సరాల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.
శ్రీ చక్రానికి ప్రత్యేక పూజలు
ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు,శ్రీ చక్రాన్ని కూడా పూజిస్తారు. అమ్మవారికి గాజులు, నిమ్మకాయలను సమర్పించి ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నిమిషాల్లో తీరుతాయని అక్కడ భక్తులు విశ్వాసం. అమ్మవారికి సమర్పించిన నిమ్మకాయలను ఇంటిలో ఉంచుకోవడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని భావిస్తారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.