చిలుకలూరిపేట టీడీపీలో చిచ్చు – పుల్లారావు తిరుగుబాటు ఖాయమా ?

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ సారి చిలుకలూరిపేట నుంచి టిక్కెట్ లేదని టీడీపీ నుంచి స్పష్టత వస్తోంది. తన నియోజవకర్గంలో విడదల రజనీని ప్రోత్సహించింది ఆయనే. ఆమె కుటుంబంతో పుల్లారావుకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అసలు ఎవరికీ తెలియని ఆమెను… మహానాడులో మాట్లాడించే అవకాశాన్ని పుల్లారావు ఇప్పించారు. తర్వాత ఆమె .. పుల్లారావు సీటు కావాలని పట్టుబట్టింది. చివరికి కాదనడంతో వైసీపీలో చేరి అక్కడ మర్రి రాజశేఖర్ కు సీటు లేకుండా చేశారు . అనుకున్నట్లుగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. కానీ ఆమెను రాజకీయాలకు పరిచయం చేసిన పుల్లారావుకు రిటైర్మెంట్ దగ్గర పడినట్లయింది.

చిలుకలూరిపేట టీడీపీకి కొత్త అభ్యర్థి

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్ధిగా గత కొంతకాలం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తోంది. ప్రత్తిపాటి పుల్లారావు చిలుకలూరిపేట నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో తన శిష్యురాలు విడదల రజనీ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పుల్లారావు నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్‌లోనే గడుపుతూ వచ్చారు. పార్టీని పట్టించుకోలేదు. పార్టీ క్యాడర్ పై కేసులు పెడుతున్నా పెద్దగా స్పందించలేదు. అయితే పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అనిపించిన వెంటనే రంగంలోకి దిగిపోయారు. తనకే టిక్కెట్ అని హడావుడి చేస్తున్నారు.

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పుల్లారావు

పుల్లారావు పార్టీని పట్టించుకోలేదు. భాష్యం ప్రవీణ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడెదో రూ.కోటితో హడావుడి చేస్తారని.. తర్వాత చేతులెత్తేస్తారని పత్తిపాటి అంటున్నారు. అక్కడో పది వేలు, ఇక్కడో రూ.10 వేలు ఖర్చు పెట్టేవారికి టికెట్లు ఇచ్చేస్తారా అని అసహనానికి గురవుతున్నారు. ప్రజల్లో వున్న నేతలకు, గెలుస్తామనే నేతలకే టికెట్లు ఇవ్వాలని ఆయన అంటున్నారు. తనకు టిక్కెట్ లేదని క్లారిటీ వచ్చింది కాబట్టే ఆయన అసంతృప్తి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు పుల్లారావు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేస్తున్నారు.

చివరికి చంద్రబాబు పుల్లారావుకు హ్యండివ్వడం ఖాయమా ?

భాష్యం ప్రవీణ్‌కు చంద్రబాబు నర్సరావుపేట పార్లమెంట్ స్థానం ఇస్తారన్న ప్రచారం గతంలో జరిగింది. అయితే ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. పుల్లారావు అదృష్టం బాగుంటే సరే.. లేకపోతే… బాష్యం ప్రవీణే అభ్యర్థి అవుతారని అంటున్నారు. మొత్తంగా ఈ సారి చిలుకలూరిపేటలో కొత్త అభ్యర్థి అయితేనే .. టీడీపీ అడ్వాంటేజ్ ఉంటుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.