జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజకీయాలను పార్ట్ టైమ్ గానే భావిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఆయన ప్రజల్లో ఉండే కాల్ షీట్ల సంఖ్య పరిమితంగా ఉంటోది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ సిటీలో వారాహి విజయయాత్ర చేపట్టారు. అద్భుతమైన స్పందన వచ్చిందని జనసైనికులు సంతోషపడ్డారు. అయితే ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయారు పవన్ కల్యాణ్. కుటుబంంతో గడపేందుకు కొన్నాళ్లు విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు రెండు వారాల పాటు ఆయన కీలక సినిమా షూటింగ్లో ఉంటారని చెబుతున్నారు.
ఫస్ట్ షూటింగ్లకే ప్రయారిటీ
ఉస్తాద్ షూట్లో జాయిన్ అయినందున మరో రెండు వారాల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు. డిసెంబర్ లో జమిలీ ఎన్నికలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో జనసేనాని ఇంత నింపాదిగా ఉండటం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. దానికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ముందు నుంచీ.. ఏపీలో ముందుగానే ఎన్నికలు వస్తాయని.. కేంద్ర పెద్దలు తనకు చెప్పారని.. ఎన్నికల సంఘం ఈ మేరకు సన్నాహాలు చేస్తోందని గతంలో పవన్ ప్రకటించారు. కానీ ఆయనే మళ్లీ ఈ అంశంపై స్పష్టత కోల్పోయినట్లుగా కనిపిస్తోంది.
కొద్ది సీట్లలో పోటీ చేసేదానికి ఇంత కష్టం ఎందుకనుకుంటనున్నారా ?
జనసేన అధినేత పొత్తులు ఖాయమని చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోటనే పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు స్పష్టత ఉంది. కానీ రాజకీయాల్లో ప్లాన్ ఏ .. ప్లాన్ బీ కూడా ఉండాలని చెబుతూంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా… రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి సిద్ధపడాలి. అందు కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ పవన్ కల్యాణ్ .. ఈ విషయంలో అంత చురుకుగా లేరన్న వాదన వినిపిస్తోంది. తాను కొద్ది సీట్లలోనే పోటీ చేస్తానని… ఆ మాత్రం దానికి ఇంత కష్టపడటం ఎందుకన్నట్లుగా ఆయన తీరు ఉండటం జనసైనికుల్ని ఇబ్బంది పెడుతోంది.
ఎన్నికలున్నా… నెలలో సగం రోజులు ఆఫ్ లైన్
పవన్ కల్యాణ్.. ఈ నెల చివరి వారం నుంచి మరోసారి వారాహి యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. విశాఖ సిటీలో యాత్ర పూర్తయినందున ఈ సారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్ర కొనసాగించే అవకాశం ఉంది. ప్రతీ నెలా రెండు వారాలు సినిమా షూటింగ్‌లకు కేటాయించాలని ఇది వరకే నిర్ణయించారు. ఎన్నికలకు ముందే ఓజీ, ఉస్తాద్ సినిమాలను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ లోనూ పొలిటికల్ పంచ్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ప్రచారం చేయకుండా సినిమా డైలాగులు చెప్పడం రాజకీయం కాదన్న విమర్శలు సహజంగానే వినిపిస్తున్నాయి.