అతిథి దేవోభవ – అద్భుత భారతావని పిలుస్తోంది… రండి …

ప్రపంచ దేశాల ఆర్థిక అసమానతలు పోగొట్టే దిశగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న జీ-20 దేశాలు శని, ఆదివారాలు ఢిల్లీ వేదికగా శిఖరాగ్ర సదస్సు కోసం సమావేశమవుతున్నాయి. ఉక్రెయిన్ నుంచి భారత చైనా సరిహద్దు వరకు అనేక అంశాలు చర్చకు రానున్నాయి. వచ్చే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా పలు అంచెల్లో సెక్యూరిటీ ఏర్పాట్లు చేసింది.

ప్రధాని మోదీ వీడియో సందేశం…

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన బిజీ షెడ్యూల్ ను సైతం పక్కన పెట్టి జీ-20కి వచ్చే అతిథులకు ఓ వీడియో సందేశమిచ్చారు. సెప్టెంబరు 9,10 తేదీల్లో భారత్ మండపంలో జరిగే సదస్సుకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం వారి కోసం సిద్ధం చేశామని మోదీ తెలిపారు. విదేశీ ప్రతినిధులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేందుకు ప్రతీ భారతీయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. కళ, సంస్కృతీ, భాషా వైవిధ్యం , సంగీతం, ఆహారం ఏదైనా సరే భారత్ తన ప్రత్యేకతను చాటుకుంటుందని మోదీ ప్రకటించారు. అతిథి దేవోభవ అన్న నానుడిని నిజం చేస్తూ ప్రతీ విదేశీ ప్రతినిధి సంతృప్తి చెందే విధంగా ఆతిథ్యం ఉంటుందన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనే దిశగా సదస్సులో ఫలవంతమైన చర్చలు సాగాలని మోదీ ఆకాంక్షించారు.

సరిహద్దులను మూసేసిన అధికారులు

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు నిర్వహణలో భాగంగా ప్రభుత్వం అనేక ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. అంబులెన్సులు, వైద్య సిబ్బంది, నిత్యావసర సేవల విభాగాలు మినహా మిగతా వారెవ్వరూ రోడ్లపై తిరగకూడదని ఆదేశించింది. ఇందుకోసం రెండు రోజుల పాటు స్కూల్స్, కాలేజీలు,బ్యాంకులు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. జనం స్థానికంగా తిరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇండియా గేట్, కర్తవ్య పథ్ ప్రాంతాల్లో వాకింగ్, సైక్లింగ్ లాంటి పనులు వద్దని ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా దళాలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

5 వేల సీసీటీవీ కెమెరాలు…

ఢిల్లీలో మొత్తం లక్షమంది పోలీసులు, భద్రతా సిబ్బంది పహరా కాస్తారు. ఇందుకోసం ఓ అత్యాధునిక కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేశారు. ఐదు వేల సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రతీ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. గగనతలంలో నిఘా కోసం పదో తేదీ వరకు క్షిపణి ప్రయోగాలు కూడా నిలిపివేశారు. రాడార్ల సాయంతో శత్రు విమానాల కదలికలను పసిగడతారు. శత్రువిమానాలు తమ పరిధిలోకి వచ్చిన పక్షంలో వాటిని కూల్చేసేందుకు క్షిపణి వ్యవస్థను సిద్ధంగా ఉంచారు. శత్రువులను వెంటబడి కొట్టేందుకు రఫెల్ జెట్స్ కూడా రెడీగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 4 నుంచే చైనా, పాకిస్థాన్ సరిహద్దులో భద్రతను పటిష్టం చేసినట్లు చెబుతున్నారు. సెప్టెంబరు 14 వరకు లద్దాక్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ లో ప్రత్యేక భద్రతా చర్యలు అమలులో ఉంటాయి.