హిమాచలం – కాంగ్రెస్ కు కష్టకాలం

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి విజయావకాశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. మోదీని కొట్టడం అసాధ్యమని తెలిసినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వ గ్రూపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. దక్షిణాదిన ఒకటి రెండు రాష్ట్రాలు మినహా… ఉత్తరాదిలో స్మాల్ స్టేట్స్ కూడా కాంగ్రెస్ ను ఆదరించడం లేదని గత గణాంకాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కొరకరాని కొయ్యగా హిమాచల్ ప్రదేశ్…

పర్వతప్రాంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఏం జరగబోతోందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగానే కొనసాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరుస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. అనేక అంశాల్లో వెనుకంజలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలాన్ని దెబ్బకొట్టగలదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రాష్ట్ర నేతలు టెన్షన్ పడిపోతున్నారు. పార్టీలో అసమ్మతి తారా స్థాయికి చేరింది.

ఒక్క సీటు కూడా రాని ఎన్నికలు

హిమాచల్ ప్రదేశ్లో నాలుగు లోక్ సభా స్థానాలున్నాయి. 2014 ఆ తర్వాత, 2019లో జరిగిన లోక్ సభ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. నాయకత్వ బలం, మోదీ ఛరిస్మాతో బీజేపీ హిమాచల్ లో క్లీన్ స్వీప్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతోంది. వీరభద్ర సింగ్ లాంటి బడా నాయకులు కాంగ్రెస్ లో ఉండి కూడా ఒక్క ఎంపీని గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకి పెద్ద టాస్కే ఉంది. బీజేపీ జైత్రయాత్రను ఆపేందుకు ఆయన ప్రయత్నించాలి.

హామీలు అమలు చేయలేక తంటాలు..

సగటు ఓటరు కాంగ్రెస్ పార్టీని విశ్వసించేందుకు అవకాశం లేని పరిస్తితి తెచ్చుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పది హామీలిచ్చింది. మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తామని, ఉద్యానవన పంటల మద్దతు ధర రైతుల చేతుల్లోనే ఉంటుందని, ఆవు పేడ కిలో రెండు రూపాయలకు కొంటామని, ప్రతీ పాడి రైతు నుంచి కనీసం పది లీటర్ల పాలు కొంటామని, ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు ఓపీఎస్ మినహా ఎలాంటి హామీని హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చక పోవడంతో జనంలో వారి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పార్టీలో అంతర్గత కుమ్ములాట

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట బీజేపీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మంత్రి పదవులు దక్కని వాళ్లు ముఖ్యమంత్రి సుఖుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. వెంటనే కెబినెట్ విస్తరణ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వారే ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు.