గోకుల కృష్ణుడు..గోపాల కృష్ణుడు..చిన్నికృష్ణుడు.. ముద్దులకృష్ణుడు..మురిపాల కృష్ణుడు అంటూ గోవిందుడిని ప్రార్థిస్తారు. శ్రీ కృష్ణుడికి అత్యంత ఇష్టమైన క్షేత్రాలుగా మధుర, ఉడిపి, ద్వారక అని చెబుతారు. అయితే కేరళ కొట్టాయం సమీపం తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలయం. ఆ ఆలయంలో ప్రత్యేకతల గురించి మీకోసం…
స్థలపురాణం
మహాభారత కాలంలో వనవాసం, అజ్ఞాతవాసం సమయంలో నాలుగు చేతులతో కూడిన తన విగ్రహాన్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు పాండవులకు ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. అజ్ఞాతవాసం పూర్తిచేసుకున్న తర్వాత పాండవులు వెళ్లిపోతుండగా స్థానికులంతా ఆ విగ్రహాన్ని ఇవ్వమని ప్రార్థించారట. అప్పుడు అక్కడి ప్రజల కోరిక మేరకు అక్కడే ఓ మందిరాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. కాలక్రమంలో పూజలు లేకపోవడంతో కొందరు ఆ విగ్రహాన్ని సముద్రంలో కలిపివేశారు. ఆ తర్వాత ఆ విగ్రహం అనంతర విశ్వమంగళం స్వామియార్ చేతికి చేరడంతో ప్రతిష్టించారు. తిరువరప్పులో చిన్ని కృష్ణుడికి మహా ఆకలి అని చెబుతారు. అందుకే ఇక్కడ స్వామివారికి రోజుడి ఏడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ప్రతిసారీ ఆ నైవేద్యం తగ్గిపోవడం విశేషం.
చిన్ని కృష్ణుడికి ఆకలెక్కువ
ప్రతి రోజు రాత్రి ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. తరువాత కొన్ని నిమిషాల్లోనే ఆలయాన్ని తెరుస్తారు. ఈ సందర్భంగా తాళం రాకపోతే దానిని విరగొట్టేందుకు అర్చకుడు గొడ్డలి పట్టుకుని ఉంటారు. గ్రహణ సమయాల్లోనూ ఆలయాన్ని మూసివేయరు. గతంలో ఒకసారి మూసివేస్తే స్వామివారు ఆకలితో బాధపడి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులైంది. అప్పటి నుంచి గ్రహణ సమయాల్లోనూ మూసివేయరు. పైగా కన్నయ్య ఆకలి తీర్చేందుకు రోజుకి ఏడుసార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ప్రతిసారీ నైవేద్యం తగ్గుతూ ఉంటుంది. అంటే కృష్ణుడు స్వయంగా తిన్నాడని విశ్వసిస్తారు. కంస వధ సందర్భంగా ప్రత్యేకమైన ఢంకాను కృష్ణుడు మోగించారట. అలాంటి ఢంకా ఇక్కడ ఉంది. ఆలయప్రాంగణంలో గణపతి,భూతనాధ,శివ, భగవతి, సుబ్రమణ్య, యక్షి ఆలయాలున్నాయి. పూరం ఉత్సవాల సందర్భంగా ఏనుగులతో పెద్ద ప్రదర్శన ఉంటుంది. పదేళ్లలోపు చిన్నారులు బాలకృష్ణుల అలంకారంలో ఆలయంలో తిరుగుతుంటారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.