ప్రకాశం వైసీపీలో అలజడి – గుట్టుగా ముఖ్య నేతలు చేస్తున్న రాజకీయం ఇదా ?

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో రచ్చ మామూలుగా లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి సర్దుకుపోయినట్లుగా కనిపిస్తోంది కానీ.. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీతో ఒంగోలు రాజకీయం వేడెక్కింది. టీటీడీ చైర్మన్ గా ఇన్నాళ్లూ ఆ బాధ్యతల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఒంగోలుకి దూరమయ్యారు. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన ఆయన 2019లో ఆ సీటు మాగుంట ఫ్యామిలీకి త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై వైవీ దృష్టి పెట్టిన ఆయన ఒంగోలులో తన వర్గాన్ని సమీకరిస్తున్నారు.

బాలినేని మంత్రిగా ఉన్నంత కాలం ఒంగోలుకు దూరం

బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నంత కాలం వైవీ సుబ్బారెడ్డి ఒంగోలుకు దూరంా ఉన్నారు. వ్యక్తిగత పర్యటనలు తప్ప రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు వైవీ. ఇప్పుడు ఒంగోలుపై ఆయన దృష్టి పెడుతున్నారు. ప్రయటనల్లో బాలినేని వ్యతిరేక వర్గీయుల్ని వెంట తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. అంటే బాలినేనికి పోటీగా వైవీ తన వర్గాన్ని ఒకేచోటకు చేరుస్తున్నారనేది మాత్రం స్పష్టమవుతోంది. ఇదంతా ఎన్నికల్లో పోటీ చేసే వ్యూహంతోనేనని చెబుతున్నారు.

జగన్ ఎంపీ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చారా ?

ఒంగోలు ఎంపీ స్థానం నుంచి తిరిగి పోటీ చేయాలనేది వైవీ ఆలోచన. అందుకే ఆయన ఒంగోలు కేంద్రంగా రాజకీయాలు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల తరచూ ఒంగోలుకి వస్తున్నారు. పైగా ఆయన్ను ఢిల్లీ వ్యవహారాలకోసం జగన్, పార్టీలో బిజీ అయ్యేలా చేస్తున్నారు. అంటే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయన లోక్ సభకు పోటీ చేస్తారని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. మరోసారి ఒంగోలు సీటు ఇస్తే మాగుంట ఫ్యామిలీ వైసీపీలోనే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఒంగోలునుంచైనా, లేదా నెల్లూరు నుంచయినా మాగుంట ఫ్యామిలీ టీడీపీ తరపున బరిలో నిలిచే అవకాశముందని చెబుతున్నారు. మాగుటంను వదులుకోవడానికి జగన్ రెడీగా ఉంటారా అన్నది కూడా కీలమే.

బాలినేని ఏం చేస్తారు?

వైవీ మళ్లీ ఒంగోలుకి వస్తే బాలినేని హవా తగ్గినట్టే చెప్పుకోవాలి. అందుకే ఆయన మాగుంట ఫ్యామిలీకి దగ్గరయ్యారు. గతంలో బాలినేని, మాగుంట మధ్య అంత సఖ్యత లేకపోయినా.. ఇప్పుడు వారిద్దరూ ఒకటయ్యారు. ఒక్కటిగా వైవీకి చెక్ పెట్టాలనుకుంటున్నారు. కానీ వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని.. చెబుతున్నారు. అందుకే బాలినేని , మాగుంట కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.