చింతపండు ఆరోగ్యానికి మంచిదా – కాదా!

పుల్లపుల్లగా, కొంచెం తియ్యగా నోరూరించేలా ఉంటుంది చింతపండు. వంటకంలో దీని వినియోగం ఎక్కువే. పప్పు, సాంబార్, కర్రీ, చెట్నీ ఇలా ఎందులో అయినా కాస్తంత చింతపండు వెయ్యనిదే రుచి రాదు. అయితే చింతపండు వాడకం అంత మంచిది కాదంటారు. ఇది నిజమా? చింతపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలే లేవా అంటే ఎందుకు లేవు అంటారు ఆరోగ్య నిపుణులు.

చింతపండువల్ల ఆరోగ్య ప్రయోజనాలు
వంటల్లో చింతపండు కేవలం రుచికోసం మాత్రమే కాదు ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాదు బరువుని నియంత్రించడంలోనూ కీలకంగా సహాయపడతాయి. ప్రోటీన్స్, అధిక మొత్తంలో కార్బో హైడ్రేట్స్, ఫైబర్, షుగర్, విటమిన్ బి1, బి 2, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులు తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.

బరువు తగ్గిస్తుంది
చింతపండులో చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులో కొవ్వు ఉండదు. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ బరువు తగ్గడానికి బాగా పని చేస్తాయి. ఇందులో ఉండే ఎంజైమ్ లు ఆకలిని నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపడుతుంది
పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలని బలోపేతం చేస్తుంది చింతపండు. జీర్ణ ప్రక్రియని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. అతిసారను తగ్గించేందుకు ఇది మంచి ఔషధం.

గుండె సంరక్షణ
చింతపండు గుండెను సంరక్షిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని నివారిస్తుంది.

పేగుల్లోని అల్సర్ నివారణ
చిన్న పేగు, పొట్టలో ఏర్పడే అల్సర్ కారణంగా తిన్న ఆహారం జీర్ణమయ్యే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పేగుల్లో మంట కారణంగా ఆహారాన్ని తినలేక ఎంతో ఇబ్బంది పడతారు. చింతపండు తినడం వల్ల ఇటువంటి అల్సర్స్ తో పోరాడుతుంది.

కాలేయాన్ని రక్షిస్తుంది
చింతపండు కాలేయాన్ని రక్షిస్తుంది. దీన్ని రోజువారీ డైట్ లో భాగంగా తీసుకుంటే కాలేయం చుట్టూ ఏర్పడే కొవ్వుని నియంత్రిస్తుంది. ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఇది మనకు రక్షణగా నిలిస్తుంది.

చింతపండులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులు తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.