రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతి (బీసీ) జాబితాలో ఉన్న 40 కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌పై నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) స్పష్టమైన హామీ ఇచ్చింది. సాంకేతిక, న్యాయపరమైన చిక్కులున్న కొన్ని కులాలు మినహా మిగతా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై ఫైనల్ పబ్లిక్ హియరింగ్ ఢిల్లీలో పూర్తియంది.
కొన్ని కులాల విషయంలో న్యాయపరమైన చిక్కులు
కొన్ని కులాల విషయంలో న్యాయపరమైన చిక్కులున్నాయి. వాటిని మినహాయించి మిగతా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కమిషన్ నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో తమ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. న్యాయపరమైన చిక్కులు పరిష్కారమైన వెంటనే మిగతా కులాలను కూడా జాబితాలో చేర్చుతారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్దత
దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్దత కల్పించారు. బీసీ కమిషన్ నిర్వహించిన ఫైనల్ హియరింగ్‌లో బీజేపీ బీసీ సెల్ చీఫ్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడం వల్లనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు రిజర్వేషన్లు అమలు చేయకపోతే చర్యలు తీసుకునే పరిస్థితి గతంలో ఉండేది కాదని, కానీ ఇప్పుడు కమిషన్‌కు ఉన్న రాజ్యాంగబద్ధత కారణంగా ఆ సమస్య లేకుండా పోయిందని తెలిపారు.
మోదీ ప్రభుత్వంలో 26 మంది బీసీ మంత్రులు
మోదీ హయాంలోనే కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారని, ఏకంగా 26 మంది మంత్రులు బీసీ వర్గాల నుంచి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, స్పెషల్ గ్రాంట్స్ మాదిరిగా బీసీలకు కూడా ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలన్న ఆలోచనపైనా చర్చ జరుగుతోంది. ఆ దిశగా బీసీ కమిషన్ సిఫారసులు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలుగా కొనసాగిన 26 కులాలను తెలంగాణ ఏర్పడ్డాక తొలగించారని, ఆ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ సమస్య బీసీ కమిషన్ సిఫార్సులతో పరిష్కారమయ్యే అవకాశం ఉంది.