భరతవర్షే, భరతఖండే.. అనే మాట ఇవ్వాల్టికి కాదని అందరికీ తెలుసు. ప్రతీ హిందువు నోట పూజలు, ప్రార్థనల సమయంలో ఆ మాటలు వస్తూనే ఉంటాయి. పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా, నీ జాతి నిండు గౌర్వమ్ము అని రాయప్రోలు సుబ్బరావు కవీంద్రుడు రాసినప్పుడు ప్రతీ ఒక్కరి గుండె ఉప్పొంగిన మాట వాస్తవం.ఇప్పుడు మాత్రం ఒక ఆహ్వానపత్రికపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముదిస్తే ఇండియా కూటమి పార్టీలు వామ్మో, వాయ్యో అని గగ్గోలు పెట్టేస్తున్నాయి.
అసలేం జరిగింది…
భారత రాజధాని ఢిల్లీలో ఈ నెల 9,10 తేదీల్లో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ… దానికి హాజరయ్యే అతిథులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా విందు ఇవ్వబోతున్నారు. దాని కోసం వారికి పంపిన ఆహ్వానపత్రంలో ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. సాధారణంగా అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటంది.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర హేమాహేమీలు హాజరవుతున్న అంతర్జాతీయ సదస్సులో రాష్ట్రపతిని సంభోదించే తీరును మార్చడం అత్యంత గణనీయమైన మార్పుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక అధికారిక కార్యక్రమంలో ఇండియా పేరును భారత్ అని మార్చడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు అంటున్నాయి. అంతేగాక విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేసిన జీ-20 బుక్లెట్లో కూడా ‘భారత్’ అనే పేర్కొన్నారు. జీ-20 కూటమి అధ్యక్ష స్థానంలో ఉన్న భారతదేశం గురించి అందులో వివరిస్తూ.. ‘భారత్, ప్రజాస్వామ్యానికి తల్లి ’ అనే శీర్షిక పెట్టారు.
తొలుత గుర్తు చేసిన మంత్రి ప్రధాన్…
ఆహ్వానపత్రంలో భారత్ ప్రస్తావనను విపక్షాలు గుర్తించలేదు. ఆ మాటను కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావిస్తూ రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. వలసవాద దృక్కోణం నుంచి దేశాన్ని బయట పడేసే చర్యలు తీసుకున్నందుకు రాష్ట్రపతిని ఆయన ధ్యాంక్స్ చెప్పారు. జాతీయ గీతంలో కూడా భారత భాగ్య విధాతా అని ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇటీవలి కాలంలో ఎన్ని సార్లు భారత్ పదం వాడారో వివరించారు. ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా, గ్రీన్ పర్యటనల్లోనూ, ప్రస్తుతం ఇండోనేషియా పర్యటనల్లోనూ ప్రైమ్ మినిష్టర్ ఆఫ్ భారత్ అని ముద్రించిన సంగతిని బీజేపీ గుర్తు చేస్తోంది..
ఇండియా కూటమి గగ్గోలు
ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పదాన్ని విపక్ష ఇండియా కూటమి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ కూటమి పేరుకే భయపడి భారత్ అని మార్చేశారని కొత్త ఆరోపణలు చేశాయి. ప్రజలను విభజించి పాలించాలనుకున్న బీజేపీ ఇప్పుడు భారత్ పేరుతో కల్లోలం సృష్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నంలో ఉందని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. భారత నాగరికత జైత్రయాత్రకు ఇది నిదర్శనమని వివరణ ఇచ్చింది.
అంబేద్కర్ ప్రతిపాదించిన అంశమే…
భారత రాజ్యాంగంలో ఆ మాట ఇప్పటిది కాదు. రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత దాన్ని రాజ్యాంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు. 1948 నవంబరు 4న రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టిన తొలి డ్రాఫ్ట్ లో ఆ మాట ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఏడాది తర్వాత 1949 సెప్టెంబరు 18న ఆర్టికల్ 1కి బాబా సాహెబ్ అంబేద్కర్ సవరణలు ప్రస్తావించినప్పుడు .. ఇండియా దటీజ్ భారత్, షల్ బీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ..అని ప్రతిపాదించారు. కొందరి అభ్యంతరాలు వీగిపోగా అప్పటి నుంచి ఇండియా దటీజ్ భారత్ అన్న పదజాలం వాడకంలోనే ఉంది. ఆ సంగతి తెలిసిప్పటికీ విపక్షాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం ప్రస్తుత మార్పును వ్యతిరేకిస్తున్నాయనే చెప్పాలి. దేశం పేరు మార్చేందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారన్న విపక్షాల ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. అయితే భారత్ అన్న మాట ఇకపై ఎక్కువ సార్లు వినియోగంలో ఉంటుందని తేల్చేసింది.