ఉదయనిధి వివాదం – ఉత్తరాదికి, దక్షిణాదికి మారుతున్న కాంగ్రెస్ విధానం

డీఎంకే తీరే వేరు. తమిళుల ఆలోచన వేరు. వారిలో చాలా మంది దేవుడ్ని నమ్మేవారు కాదు. ఇప్పడిప్పుడే కొంత మంది భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగించుకుంటున్నప్పటికీ ద్రవిడ ఉద్యమ విధానాలను మాత్రం వదులుకోలేకపోతున్నారు. దేవుడ్ని నమ్మే వారిని కొట్టండన్న నినాదంతోనే డీఎంకే మాతృ సంస్థ డీకే పనిచేస్తోంది. ఇటీవలే డీఎంకే, డీకే మీటింగులు నిర్వహించిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు.

డీఎంకేకు కొనసాగే కాంగ్రెస్ మద్దతు…

తమిళ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పదే పదే అదే మాట అంటున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెబుతూనే ఉంటానంటున్న స్టాలిన్ తనయుడి తీరును ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఖండించిన దాఖలాలు లేవు. పైగా కొందరు ద్రవిడ సిద్ధాంతాలను నాశనం చేయాలని చూస్తున్నారని, కమ్యూనిజాన్ని నిర్మూలించాలని చెబుతున్నారని స్టాలిన్ కుమారుడు మరో దాడికి ప్రయత్నించారు.బీజేపీపై రాళ్లు విసిరేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు.కమలం పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఉదయనిధి అనడం విడ్డూరంగా అనిపిస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ఉదయనిధికి మద్దతివ్వడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పది లోక్ సభ సీట్ల కోసం …

ఉదయనిధి ప్రకటనపై కాంగ్రెస్ నేతలు ప్రాంతాన్ని బట్టి స్పందించడం కూడా వారి అవకాశవాద రాజకీయాలకు దర్పణం పట్టేదిగా ఉంది. తమిళనాడు ఎంపీ కార్తీ చిదంబరం సహా పలువురు అక్కడి కాంగ్రెస్ నేతలు ఉదయనిధి ప్రకటనలో తప్పేమున్నదీ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ పార్టీ పంచన చేరతేనే కొన్ని లోక్ సభ సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ పుణ్యమాని కొందరు కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ గడప తొక్కారు. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉదయనిధి ప్రకటనతో కాంగ్రెస్ ఇరకాటంలో పడినా స్టాలిన్ ను దూరం చేసుకోలేమని కూడా తెలుసు. కొన్ని రోజులుగా రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు సాప్ఠ్ హిందూత్వాన్ని పాటిస్తున్నప్పటికీ తమిళనాడుకు వచ్చే సరికి అలా కాదులే.. ఎవరి అభిప్రాయం వారిదిలే అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. ప్రతీ పార్టీకి తన అభిప్రాయాలు ఉంటాయంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పుడు డీఎంకేను వెనుకేసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రూటే వేరప్పా…

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. గుళ్లకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలన్నీ పూర్తిగా వ్యక్తిగతమని ప్రకటించిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్….తన స్ట్రాంగ్ హోల్డ్ గా పిలిచే ఛింద్వారాలో ఆలయాలు కట్టిస్తూ, మహాకాళేశ్వర్ పూజలు చేస్తూ హిందూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. అప్పుడప్పుడు మతపెద్దలకు కలుస్తూ వారి ఆశీర్వచనం పొందుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే రూల్ వర్తింప జేస్తోంది.హిందూత్వవాద శివసేనను సంతోషపెట్టేందుకు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పాటోలే చేయని ప్రయత్నం లేదు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు ఉదయనిధి స్టేట్ మెంట్ పై మీడియాకు సాధ్యమైనంత దూరం పాటించే ప్రయత్నం చేస్తున్నారు.