గవర్నర్‌గా రజనీకాంత్ – సూపర్ స్టార్‌కు అత్యున్నత గౌరవం లభించబోతోందా ?

జైలర్ తో కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ లను అందుకుని రికార్డు సృష్టించిన రజనీకాంత్ ఇప్పుడు మరో అత్యున్నత గౌరవాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రజనీకాంత్ తన తీర్థయాత్రల పర్యటనల్లో భాగంగా యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే ఆ పర్యటనల్లో బీజేపీ నేతలనే కాదు అందర్నీ కలిశారు. కానీ ఆయన మళ్లీ తమిళనాడు చేరుకునే సరికి.. గవర్నర్ పదవి గురించి పుకార్లు ప్రారంభమయ్యాయి.. ఎప్పట్లాగే ఈ పుకార్లపై రజనీకాంత్ స్పందించలేదు.

గవర్నర్ పోస్టుకు రజనీ పేరు పరిశీలన

గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు కానీ.. అనారోగ్యానికి గురయ్యారు. దేవుడు తనను రాజకీయాల్లోకి వద్దంటున్నారని డిసైడయ్యి.. పార్టీ ప్రకటన విరమించుకున్నారు. మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇక తాను రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు. జైలర్ సూపర్ హిట్ తో రజనీ కాంత్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు గవర్నర్ పదవి రెడీ అయిందని… ప్రచారం జరుగుతోంది. రజనీ అంగీకరిస్తే.. గవర్నర్ పదవి పెద్ద విషయం కాదు. గవర్నర్ పదవికి రాజకీయమేమీ ఉండదు కాబట్టి అంగీకరించినా సమస్య ఉండదన్న వాదన ఉంది. కానీ రజనీ ఆలోచనలు ఎలా ఉన్నాయో స్పష్టత లేదు.

రజనీ సోదరుడు పాజిటివ్ స్పందన

సూపర్ స్టార్ సోదరుడు సత్యనారాయణ మధురైనలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రజినీకాంత్ కు గవర్నర్ పదవి రావడం ఆ భగవంతుడి చేతుల్లో ఉందని సత్యనారాయణ తెలిపారు. రజినీ గవర్నర్ పదవిపై ఎలాంటి ఆశ పెట్టుకోలేదని, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామన్నారు సత్యనారాయణ. అంటే.. రజనీకాంత్ రెడీగా ఉన్నారని ఆయన చెప్పినట్లు అవుతుంది. కానీ నేరుగా రజనీ నుంచి అలాంటి స్పందన వస్తేనే గ్యారంటీ అనుకోగలమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ సిద్దాంతాలకు మద్దతుదారుడు రజనీకాంత్

దైవానుగ్రహంతో అవినీతిరహిత రాజకీయాలు అనేది రజనీకాంత్ ఆలోచన. కరప్షన్ ఫ్రీ రిలిజియస్ పాలిటిక్స్‌ కావాలని ఆయన కోరుకుంటారు. తమిళనాడులో ప్రస్తుతమున్న రెండు ద్రవిడ పార్టీలకు అవినీతి మరకలు అంటుకున్నాయి. మరోవైపు వీరి సిద్ధాంతాల్లో ఇటు దేవుడు, అటు మతం రెండింటికీ చోటులేదు. రజనీ రాజకీయాల్లోకి వస్తే అదే భావజాలంతో పార్టీని నడిపేవారు. అయితే, ఇంచుమించు బీజేపీదీ ఇదే వైఖరి. కమలనాథులు కూడా ఇలాంటి సిద్ధాంతాలనే నమ్ముతుంటారు. అందుకే మోదీపై రజనీకాంత్ ప్రత్యేకమైన గౌరవం ఉంది. రజనీ అన్నా మోదీ ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తారు