మైలవరం టీడీపీ, వైసీపీల్లో వర్గ పోరు – పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరుస్తుందా

వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ గెలిపించుకున్న నియోజకవర్గం మైలవరం. దేవినేని ఉమను వసంత కృష్ణప్రసాద్ నిలబెట్టి ఓడించారు. వైసీపీ అన్ని విధాలా సపోర్ట్ లభించడంతో విజయం సాధించారు. మంత్రి పదవి కూడా వస్తుందని అనుకున్నారు. చివరికి ఏ పదవీ లేదు కానీ.. ఆయన మాత్రం మైలవరంలో ఇక రాజకీయం చేయడం కష్టమేమోనన్న అభిప్రాయంతో చేతులెత్తేశారన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.

జోగి రమేష్ జోక్యంతో వెనుకబడిపోయిన వసంత

మైలవరం నియోజకవర్గం మొదటి నుంచి ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌ది. 2014 ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2019 వరకూ ఆయనే నియోజకవర్గంలో పని చేసుకున్నారు. గ్రామ.. గ్రామాన అనుచరుల్ని పెంచి పోషించారు. అయితే చివరికి ఆయనను పెడనకు మార్చారు. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్‌కు ఇచ్చారు. అయితే పెడనపై పెద్దగా నమ్మకం లేని జోగి రమేష్.. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లుగా వసంత కృష్ణ ప్రసాద్‌కు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య సరిపడటం లేదు.

పదే పదే సీఎం వద్దకు పంచాయతీ

స్థానిక ఎన్నికల్లోనూ జోగి, వసంత వర్గాలకు సరిపడలేదు. దాంతో పలు చోట్ల వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు వసంత తన సొంత మనుషులను ఇన్‌చార్జ్‌లుగా నియమించు కున్నారు. వీరంతా నందిగామ నుంచి దిగుమతి అయినవారే. దీంతో కొంత మంది జోగి రమేష్ వర్గీయులు పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మైలవరం వైసీపీ మొత్తం ఎమ్మెల్యే బామ్మర్ది కనుసన్నల్లో నడుస్తోంది. ఈ ఇన్‌చార్జ్‌లు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ పథకాల కోసం వచ్చే మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలు, సొంత మనుషుల వ్యవహార శైలి కారణంగా స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొండపల్లి మున్సిపాలిటీలో కూడా వైసీపీ ఓటమి పాలయింది. దీంతో జగన్ మైలవరం వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

టీడీపీలోనూ అదే పరిస్థితి

మరో వైపు దేవినేని ఉమ పరిస్థితి కూడా అంతే. ఆయనకు నియోజకవర్గంలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. సొంత పార్టీ నేతలు ఆయనను సమర్థించడం లేదు. వర్గ పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయనను కూడా నియోజకవర్గం మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే .. తామే అభ్యర్థులం అని పాతకాపులు ఇద్దరూ పోరాటం చేస్తున్నారు. కానీ పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా ఇద్దరు అభ్యర్థులూ మారిపోయే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి .