తమిళ రాజకీయ నాయకులకు ఎప్పుడూ డైవర్షన్ అవసరం. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల నుంచి బయట పడేందుకు హిందూ ధర్మాన్ని, దేవుడిని కించపరుస్తూ మాట్లాడి కొంత కాలం వివాదం కొనసాగితే వాళ్లు చలికాచుకుంటారు. తాజాగా డీఎంకే మూడో తరం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అదే పని చేశారు. ఆయనకు సంబంధం లేని, ఆయనకు అర్థం కాని టాపిక్ ఎత్తుకుని ఇప్పుడు కొరివితో తలగోక్కుకున్నానేమిటిరా దేవుడా అని టెన్షన్ పడిపోతున్నారు.
స్టాలిన్ కొడుకు ఏమన్నారు…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ కుమారుడు ఉదయనిధి అక్కడ డీఎంకేలో కీలక పాత్ర పోషించడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన కొంత దూకుడున్న డీఎంకే యువజన విభాగం నాయకుడిగా కూడా పేరుంది.చెన్నైలోని కామరాజార్ అరంగంలో తమిళ అభ్యదయ రచయితల సంఘం మీటింగ్ సందర్భంగా ఉదయనిధి మాట్లాడిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. సనాతన ధర్మం మలేరియా, డెంగీ, కరోనా లాంటిదని.. దోమలను, వైరస్ ను నిర్మూలించినట్లే దానినీ సంపూర్ణంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సనాతనం అనే సంస్కృత పదం .. సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా సనాతనం అంటే మార్చడానికి వీల్లేని స్థిరమైన వ్యవస్థ అని ఉదయనిధి భాష్యం చెప్పారు.
గట్టి కౌంటరిచ్చిన బీజేపీ
ఉదయనిధి మాటలకు కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. విపక్ష ‘ఇండియా’ కూటమి హిందూయిజాన్ని ద్వేషిస్తోందనడానికి ఆయన మాటలే నిదర్శనమని కేంద్ర హోం మంత్రి అమిత్షా ధ్వజమెత్తారు. ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇదీ నిదర్శనమని అమిత్ షా అన్నారు. ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారన్నారు.
అసలు డీఎంకే బాధేమిటి… ?
తమిళనాడులో డీఎంకేకు రాక రాక అధికారం చేతికి వచ్చింది. కరుణానిధికి స్టాలిన్ లా.. ఇప్పుడు ఎంకే స్టాలిన్ కు ఉదయనిధి పట్ల పుత్రోత్సాహం ఎక్కువైంది. ఏదో విధంగా తనయుడిని రాజకీయాల్లో నిలబెట్టేందుకు ఆయన తంటాలు పడుతున్నారు. పైగా డీఎంకే మూల సిద్ధాంతాలైన దేవుడు లేడు, బ్రాహ్మణ ఆధిపత్వం పోవాలి, హిందీని వ్యతిరేకించాలి లాంటివి మరుగున పడిపోతున్నాయి. వాటిని పట్టుకుని రాజకీయాలు చేస్తేనే అటు ప్రధాన ప్రత్యర్థులు అన్నాడీఎంకే, బీజేపీలను ఎదుర్కొనే వీలుంటుందని స్టాలిన్ విశ్వాసం. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఇప్పుటికే రాష్ట్రంలో మంచి నాయకుడిగా ఎదిగారు. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏం జరుగుతుందో చెప్పలేని మీమాంసలో డీఎంకే పడిపోయింది. దేశం వేరు, తమ ఆలోచన వేరు అన్నది తమిళుల తీరు. ద్రవిడ ఉద్యమ కాలం నుంచి కూడా అదే ఆలోచిస్తూ వస్తున్న డీఎంకే ఇప్పుడు ఉదయనిధిని నాయకుడిగా నిలబెట్టేందుకు కూడా అదే గేమ్ ప్లాన్ అమలు చేస్తోంది. స్టేట్ మెంట్ ఇచ్చిందీ ఉదయనిధి అయినా రాసిచ్చింది స్టాలిన్ గ్రూప్ అన్న చర్చ ఎలాగూ ఉండనే ఉంది. పైగా ఎక్కడ కదిలిస్తే వివాదమవుతుందో డీఎంకేకు బాగానే తెలుసు. అన్నాడీఎంకే కూడా డీఎంకే సిద్ధాంతం నుంచే పుట్టిన కారణంగా ఉదయనిధి స్టేట్ మెంట్ ను గట్టిగా వ్యతిరేకించలేకపోవచ్చన్న విశ్వాసం స్టాలిన్ గ్రూప్ లో ఉందనే చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ వ్యూహమేంటో ?
ఇండియా కూటమి ఇప్పుడో నానా జాతి సమితిలా మారిపోయింది. ఎంతమంది కలిసినా బీజేపీని కొట్టడం అసాధ్యమన్న నిజం వారికి తెలుసొచ్చింది. అందుకే భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉదయనిధి స్టాలిన్ లాంటి స్టేట్ మెంట్స్ వారికి అవసరమే అవుతాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి డబుల్ గేమ్ పాలిటిక్స్ బాగానే నేర్చుకుంది. ముస్లింలను తమ పక్షానే ఉంచుకునేందుకు హిందువులను నిత్యం కించపరుస్తూ ఒత్తిడిలో పెట్టడం కాంగ్రెస్ మార్క్ పాటిలిక్స్ గా చెప్పాలి. దీన్ని ముస్లిం అపీస్ మెంట్ అని కూడా అంటున్నారు. మరో పక్క 1967లో తమిళనాడులో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ఎన్నడూ తమిళనాడులో అధికారంలోకి రాలేదు. ఎవరోకరి పంచన చేరి అధికారం అనుభవించడమే వారికి అలవాటు ఇప్పుడు ఢిల్లీలో అధికారం కోసం కూడా అదే ట్రిక్స్ వాడుతున్న కాంగ్రెస్ పార్టీ…. హిందువుల్లో విభజన సృష్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నంలో ఉంది. అందుకు ఆ పార్టీ నేరుగా ఏ పని చేయదు. తన చేతికి మట్టి అంటకుండా ఇతరులతో చేయిస్తుంది. ఇప్పుడు ఉదయనిధి విషయంలోనూ జరిగిందీ అదే. ఇండియా కూటమి విషయానికి వస్తే వాళ్లు ఒక గ్రూపుగా సెటిలయ్యేందుకే నానా తంటాలు పడుతున్నారు. కొందరు నేతలు అలిగి వెళ్లిపోతున్నారు. ఐనా ఇతరుల మీద బురదజల్లి తాము ఎంజాయ్ చేయాలన్న కోరిక మాత్రం వారిని వదలడం లేదు..