ముస్లిం దండయాత్రలతోనే సామాజిక దురాచారాలు – ఆరెస్సెస్ నేత

భారత దేశం అత్యాధునిక సమాజం వైపు అడుగులు వేస్తోంది. సాఫ్ట్ వేర్ సహా పలు రంగాలు మన సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. జనం పాత వాసనలు వదిలేసి, కొత్త పంథాలో జీవించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐనా మధ్యయుగపు అలవాట్లైన బాల్య వివాహాలు, సతీ, వితంతువుల సమస్యలు అక్కడక్కడా ఇంకా కనిపిస్తున్నాయి. వీటికి కారణం ఏమిటి.. బాధ్యులెవ్వరు అంటే వేలు ఒక వైపే చూపిస్తోంది.

హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించిన మధ్యయుగం

ఆర్సెస్సెస్ కీలక నేత కృష్ణ గోపాల్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సదస్సులో కీలక ఉపన్యాసం చేస్తూ… మధ్యయుగంలో ఇస్లామిక్ దండయాత్రలతో మనదేశానికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. దండయాత్రలకు వచ్చిన ముస్లిం మూకల నుంచి అమ్మాయిలను కాపాడుకునేందుకు సమాజం వారిపై అనేక ఆంక్షలు విధించిందన్నారు. మధ్యయుగం మన దేశానికి అత్యంత క్లిష్టమైన తరుణమని అంటూ.. అప్పట్లో అమ్మాయిల మాన, ప్రాణాలను కాపాడేందుకు వారిపై అనేక ఆంక్షలు విధించారన్నారు. బాల్య వివాహాలు కూడా అలాంటివేనన్నారు. సతీ సహగమనం, వితంతు పునర్ వివాహంపై నిషేధం కూడా అప్పుడే వచ్చాయన్నారు.

సంతలో సరుకులా మారిన అమ్మాయిలు..

మన దేశంపైకి దండయాత్రకు వచ్చిన ముస్లిం పాలకులు ఇక్కడి ఆలయాలను ధ్వంసం చేశారని ఆరెస్సెస్ సీనియర్ నేత కృష్ణ గోపాల్ గుర్తుచేశారు. విశ్వవిద్యాలయాలను పగులగొట్టి నేలమట్టం చేశారన్నారు. లక్షల మంది మహిళలను పట్టుకెళ్లి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో అంగడి సరుకుల్లా అమ్మేశారన్నారు. ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లారో అర్థమయ్యేది కాదన్నారు. అహ్మద్ షా అబ్దాలీ, గజనీ మొహ్మద్, ఘోరీ మహ్మద్ ఇదే పని చేశారన్నారు. మహిళలు తీవ్ర అవమానాలకు లోనైన యుగం కూడా అదేనని కృష్ణ గోపాల్ ఆవేదన చెందారు.

ఇస్లామిక్ దాడులకు ముందు… వెనుక..

ఇస్లామిక్ దాడుల నుంచి అమ్మాయిలను కాపాడేందుకు అనేక ఆంక్షలు విధించారు. దానితో వారు బడికి వెళ్లలేకపోయారు. గురుకులాల్లో అమ్మాయిలు కనిపించలేదు. వారు అక్షరాస్యత లేని జీవులుగా మారిపోయారు. అప్పుడే బాల్యవివాహాలు, సతీ వచ్చాయి. యుద్ధాల్లో పురుషులు చనిపోవడంతో మహిళలు వితంతువులయ్యారు. నిజానికి ముస్లిం దాడులకు ముందు హిందూ మహిళలు శాస్త్ర చర్చల్లో పాల్గొనే స్థాయిలో మేథావులుగా ఉండేవారు. అనేక మంది మహిళలు పరుషులతో పోటీ పడి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. కత్తి పట్టి యుద్ధం చేశారు. శత్రువులను తరిమి కొట్టారు.

స్వాతంత్ర ఉద్యమంతో మార్పు స్పష్టంగా కనిపించింది. ఇండిపెండెన్స్ తర్వాత అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారని ఆరెస్సెస్ నేత కృష్ణ గోపాలు గుర్తు చేశారు. పరీక్షల్లో అమ్మాయిలు పైచేయిగా నిలుస్తున్నారని ఆయన ప్రస్తావించారు. సామాజిక విలువలను అలవాటు చేసుకుని తమ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం ఆధునిక మహిళలను ఆయన హెచ్చరిస్తున్నారు. పశ్చిమ దేశాల ప్రభావానికి లోను కావద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సామాజిక బాధ్యత నుంచి ఎన్నడూ దూరం కావద్దని సలహా ఇస్తున్నారు.