భారత రాజధాని కొత్త ఢిల్లీలో జరిగే జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. ఈ నెల 9…10 తేదీల్లో జరిగే సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భద్రతా చర్యలను అత్యంత పటిష్టంగా చేపట్టింది.మూడు అంచెల భద్రతతో పాటు సదస్సుకు వచ్చిన వీఐపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. పౌరులు రెండు రోజులు సర్దుకుపోవాలని, భద్రత వల్ల కలిగే ఇబ్బందులను అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీ స్వయంగా విజ్ఞప్తి చేశారు..
వస్తే బావుండేది…
అనివార్య కారణాల వల్ల జీ -20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమీర్ పుతిన్ రావడం లేదు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా రావడం లేదన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సదస్సుకు తప్పక హాజరవుతానని, రెండు రోజుల ముందే ఇండియాలో ఉంటానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్…. తన చైనా కౌంటర్ పార్ట్ జిన్ పింగ్ రావడం లేదన్న వార్తలపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు రావడం లేదన్న వార్తలతో నిరాశకు గురయ్యానని అంటూ ఆయన వస్తే బావుండేదని ద్వైపాక్షిక చర్చలకు కూడా అవకాశం ఉండేదని చెప్పారు. జీ-20 లాంటి కూటమిలో చైనా కీలక భాగస్వామి అయినప్పుడు చైనా అధ్యక్షుడు రాకకోసం అందరూ ఎదురు చూడడం సాధారణ విషయమేనన్నారు.
లిఖిత పూర్వక వివరణ కోసం…
చైనా అధ్యక్షుడి రాకపై ఎలాంటి సమాచారం ఇంకా అందలేదని భారత ప్రభుత్వం అంటోంది. డ్రాగన్ దేశం వైపు నుంచి లిఖిత పూర్వక సమాధానం కోసం వేచి చూస్తున్నామని జీ-20 మీటింగ్ స్పెషల్ సెక్రటరీ ముఖేష్ పరదేశీ వెల్లడించారు. ఇంతవరకు పత్రికల్లో వార్తలు మాత్రమే చూశామని, చైనా ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఏమీ చెప్పలేదన్నారు. నిజానికి జకార్తాలో తూర్పు ఆసియా సదస్సు తర్వాత జిన్ పింగ్ నేరుగా ఇండియా వచ్చి జీ-20లో పాల్గొనాల్చి ఉంటుంది. ఇతర దేశాల నాయకులు తమ రాకపై సమాచారాన్ని షెడ్యూల్ ను జీ-20 స్పెషల్ సెక్రటరీగి పంపగా… చైనా నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదు..
21వ సభ్యుడిగా ఆఫ్రికన్ యూనియన్
జీ -20 త్వరలో జీ-21 కానుందని సమాచారం. ఆఫ్రికన్ యూనియన్ ను జీ-20లో చేర్చుకోవాలని ఢిల్లీ సదస్సులో ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నింటి సమస్యలు తెలుసుకోకుండా ఎలా ముందుకు సాగుతామని ప్రధాని ప్రధాని మోదీ ప్రశ్నలకు సమాధానంగా 55 దేశాల కూటమి ఆఫ్రికన్ యూనియన్ ను జీ -20లో చేర్చుకుంటున్నారు. సర్వజన హితాయా, సర్వజన సుఖాయా అన్నది మోదీ నినాదం కాగా, ఢిల్లీలో సదస్సు నిర్వహించిన సందర్భంగా ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. గ్లోబల్ సౌత్ వాక్కును కూడా వినిపించేందుకు ఇదీ తగిన అవకాశమని కూడా మోదీ వాదిస్తున్నారు.