కాంగ్రెస్ ను నమ్మి నట్టేట మునిగిన షర్మిల – ఇక దారేది ?

కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో షర్మిల రాజకీయ భవిష్యత్ కనుమరుగు అయిపోయింది. విలీనం పేరుతో చేసిన రాజకీయంలో ఇప్పుడు ఎటూ కాకుండా క్రాస్ రోడ్స్ లో ఉండిపోయారు. ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ లో చోటు లేదు. తన పార్టీని మళ్లీ పట్టాలెక్కించలేరు. ఇలాంటి వ్యూహంలో ఆమె స్వయంగా ఇరుక్కుపోయారు.

విలీనం పేరుతో చర్చలు – చివరికి హ్యాండ్

షర్మిల కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదనకు ఒప్పుకుని చర్చలు జరిపారు. కానీ ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు హైకమాండ్ రెడీగా లేదు. తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారన్న మాటలు చెబుతూ టైం పాస్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పై ఆమె నీడ కూడా పడవద్దని అల్టిమేటం ఇచ్చారని.. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పోటీపై అసలు చెప్పడం లేదని కొత్త ప్రచారం ప్రారంంభించారు.పాలేరులో పోటీ చేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పిన ఆమె ఇప్పుడు… తర్వాత చెబుతానని అంటున్నారు. మరో వైపు… ఆమెపై రేణుకాచౌదరి లాంటి వాళ్లు మండిపడుతున్నారు. ఇదంతా హైకమాండ్ బేషరతుగా విలీనం చేసి కామ్ గా ఉండమని చెప్పడానికేనని అంటున్నారు.

విలీనం ఉంటుందని పార్టీ కార్యక్రమాలూ నిలిపివేత

ఏ రాజకీయ పార్టీ అయినా ముందుగా బలం పెంచుకునే ప్రయత్నం చేయాలి. పార్టీ ఉంటుందని నమ్మకం కలిగించాలి. కానీ షర్మిల .. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకుని.. .. మూడు వేల కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేసి.. తెచ్చుకున్న అంతో ఇంతో హైప్ కాస్తా.. ఎటూ కాకుండా పోయింది. చివరికి మరో పులివెందుల అని ప్రకటించుకున్న పాలేరు లో కూడా కనీస ప్రభావం చూపే పరిస్థితి లేదు. అసలు ఆమె పార్టీ ఉంటుందా ఉండదా అన్నది కూడా పట్టించుకోనంతగా తన ప్రభావాన్ని విలీనం చర్చలతో తగ్గించేసుకున్నారు. ఇప్పుడు విలీనం లేకుండా సొంతంంగా పార్టీ పెడితే కనీసం తనకు అయినా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు.

కాంగ్రెస్ గుప్పిట చిక్కి పూర్తిగా నష్టపోయిన షరమిల

రాజకీయాల్లో ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటేనే రాణిస్తారు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన షర్మిల తనపై అన్ని వైపుల నుంచి వచ్చిన వ్యూహాత్మక దాడికి గురయ్యారు. వాటిని గుర్తించి తనను తాను రక్షించుకోవడంలో విఫలం అయ్యారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. కానీ కాంగ్రెస్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవాలంటే షర్మిలకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.