ఒకే దేశం – ఒకే ఎన్నిక ! దేశానికి మేలు చేయడమే ఎజెండా !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అవసరం ఉందని చాలా సార్లు చెప్పారు. “వన్ నేషన్, వన్ ఎలక్షన్ చర్చనీయాంశం మాత్రమే కాదు, అది భారత్‌కు అవసరం. ప్రతి కొన్ని నెలలకూ భారత్‌లో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నాయి. దీనివల్ల అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. అలాంటప్పుడు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ చాలా కీలకమని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.

పార్టీలు, ప్రజలందరి అభిప్రాయం అదే

‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అంశంపై గతంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దాదాపుగా అన్ని పార్టీలు అంగీకరించారు. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, ఏఐయూడీఎఫ్, గోవా ఫార్వార్డ్ పార్టీ మాత్రమే వ్యతిరేకించాయి. అయితే వీరు ప్రతిపక్షంలో ఉండి ఉంటే అంగీకరించేవారు. అంటే రాజకీయ కారణాలతో మాత్రమే వ్యతిరేకించారు. లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, దానివల్ల నిధులు, సమయం ఆదా చేయవచ్చు. మాటిమాటికీ ఎన్నికలు నిర్వహించడం వల్ల పాలనాపరమైన పనులపై వాటి ప్రభావం పడుతుంది. దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే, పార్టీలు దేశ, రాష్ట్రాభివృద్ధి పనులకు ఎక్కువ సమయం ఇచ్చినట్టు ఉంటుంది.

కొన్ని పార్టీల వాదనల్లో అర్థం ఉండదు !

ఒక దేశం, ఒక ఎన్నిక’ నిర్వహించడం అంటే అర్థం ఎన్నికలన్నీ ఐదేళ్ల తర్వాతే జరుగుతాయి. ఆ లోపు రావు. అదే ఇప్పటి వ్యవస్థను చూస్తే, ఒకవేళ అసెంబ్లీలో ఏ పార్టీకైనా ఆధిక్యం లేదని అనిపిస్తే, ఐదేళ్ల లోపే మళ్లీ ఎన్నికలు రావచ్చు. కానీ, ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ వ్యవస్థలో అలా జగదు. ఇలాంటి సమస్యలకు లా కమిషన్ పరిష్కారాలు చూపించింది. “ఈ రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఓటర్లు కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీకి ఓటు వేస్తార”ని ఒక దేశం, ఒకే ఎన్నిక ఆలోచనను వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. కానీ ఇది పూర్తిగా తప్పుడు వాదన ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు నాలుగు అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ అక్కడ ఫలితాలు వేరువేరుగా వచ్చాయి . అంటే ఓటర్లకు ఓ స్పష్టమైన అభిప్రాయం ఉంటుంది.

దేశానికి జమిలీ ఎన్నికలు కొత్త కాదు !

స్వాతంత్ర్యం వచ్చాక 1951-52లో దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించారు. ఆ తర్వాత 1957, 1962, 1967లో కూడా ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ తర్వాత నుంచి ఆ క్రమం తప్పింది. 1999లో లా కమిషన్ మొదటిసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే బాగుంటుందని తన రిపోర్టులో చెప్పింది.ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 2015లో చట్ట, న్యాయ అంశాల పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒకే దేశం, ఒకే ఎన్నిక ఆలోచనను సమర్థించి అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దేశమంతా ఆయనకు మద్దతుగా ఉంటోంది.