అమెరికా నుంచి రానంటోనన్న కేటీఆర్ – అసంతృప్తుల భయమేనా ?

అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ నెంబర్ టు కేటీఆర్ అమెరికా చెక్కేశారు. కుమారుడ్ని కాలేజీలో చేర్పించడమే కాదు… పెట్టుబడులు పట్టుకొస్తానని ఆయన వెళ్లారు. ఇప్పటికి రెండు వారాలు అవుతోంది. ఆయన జాడ లేదు. ఆయనతో వెళ్లిన అధికారులు తిరిగి వచ్చారు. కానీ కేటీఆర్ మాత్రం అమెరికాలో ఉన్నారు.

తిరిగివచ్చే విషయంలో కేటీఆర్ ఆలస్యం

అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తన పర్యటనను పొడిగించుకున్నారు. ఇప్పుడప్పుడే ఇక్కడకు రావటానికి ఆయన సుముఖంగా లేరన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ తొలి జాబితా విడుదల సమయంలో ఆయన హైదరాబాద్ లో లేరు. అంతకు ముందు రోజు తన కుమారుడ్ని అమెరికా కాలేజీలో చేర్పించేందుకు వెళ్లారు. అధికారిక పర్యటనగా కూడా పెట్టుబడుల ఆకర్షణకు అధికారులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో షెడ్యూల్‌ ప్రకారం ఆయన శుక్రవారమే హైద రాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. కానీ రాలేదు. కేటీఆర్ తో పాటు అమెరికాకు వెళ్లిన అధికారులు తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది.

అసంతృప్తుల తాకిడి తట్టుకోలేకేనా ?

కేటీఆర్ ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఇటు మంత్రి కార్యాలయంగానీ, అటు తెలంగాణ భవన్‌ వర్గాలుగానీ స్పష్టతనివ్వలేదు. ఈ క్రమంలో ఆయన రాక మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. కేటీఆర్ రాక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఆశించిన ఆయన సన్నిహితులు, స్నేహితులు మరిన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదు. తమ అసంతృప్తి అంతా కేటీఆర్ ముందు చూపించాలని నేతలు అనుకుంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే కారణంతో… హైదరాబాద్ రావడానికి వెనుకడుగు వేస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

పార్టీలో పరిస్థితుల్ని చకదిద్దలేక అమెరికాలో ఉండిపోవడం నాయకత్వ లక్షణమా ?

పార్టీలో ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తులు ఉన్నారు. వారందరికీ సర్ది చెప్పాల్సింది కేటీఆర్. బాధ్యతల్ని తప్పించుకోవడం నాయకత్వం ఎలా అవుతుందని … త మ బాధ చెప్పుకోవాలని అనుకుంటున్న వారు ఫీలవుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం… సిట్టింగ్‌లకు టిక్కెట్ల విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా తనకు ఏం సంబంధం అన్నట్లుగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు మైనంపల్లి వ్యవహారంలో కేటీఆర్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇది మరింత రచ్చ అవుతోంది. వీటన్నింటికీ దూరంగా కేటీఆర్ అమెరికాలో ఉంటున్నారు.