ఎన్నో దండయాత్రలకు గురైనా పునర్ నిర్మితమైన జ్యోతిర్లింగ క్షేత్రం ఇది

పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథక్షేత్రం గుజరాత్‌లో ఉంది.ఎన్నో దండయాత్రలకు గురైనప్పటికీ తిరిగి పునర్‌ నిర్మితమైన క్షేత్రమిది. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపైకి అనేక మంది విదేశీపాలకులు దండయాత్రలు చేశారు. ఈ క్షేత్రం విశిష్ఠతలు మీకోసం..

శివపురాణం, నంది పురాణంలో పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ‘అన్ని చోట్ల నేనుంటాను. పన్నెండు ప్రదేశాల్లో మాత్రం మరింత ప్రభావవంతంగా ఉంటాను’ ఈ పన్నెండు ప్రదేశాలనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. సాక్షాత్తు ఆ లయకారకుడు ప్రత్యక్షంగా ఈ క్షేత్రాల్లో కొలువై ఉన్నాడు. అందుకనే ఈ క్షేత్రాలు పరమపవిత్రమైనవి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో గుజరాత్‌లోని సోమనాథ ఆలయం మొదటిది. అందుకనే ఇది మహిమాన్విత క్షేత్రమైంది.చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథక్షేత్రంగా పేరొందింది.

సోమనాథుడు ఎలా వెలిశాడంటే
దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు రోహిణితో మాత్రమే సఖ్యంగా ఉండి తమను పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రైన దక్షప్రజాపతికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన చంద్రుడు క్షయవ్యాధితో బాధపడాలని శాపమిచ్చాడు. భూలోకానికి వచ్చిన చంద్రుడు ప్రస్తుతం సోమనాథుడు కొలువైన ప్రాంతంలో శివుడి విగ్రహాన్ని పెట్టి తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపం నుంచి విముక్తి కలిగించాడు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన ప్రదేశం కాబట్టి సోమనాథక్షేత్రంగా పేరొచ్చింది.శాపవిమోచనం కలిగిందన్న ఆనందంతో చంద్రుడు..బంగారంతో ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం రావణాసురుడు వెండితో ఆలయాన్ని నిర్మించగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

అంతులేని సంపద
సోమనాథక్షేత్రంలో భారీ సంపద ఉండడంతో ఎన్నోసార్లు దండయాత్రలకు గురైంది. క్రీ.శ. 1024లో గజనీ పాలకుడైన మహమ్మద్‌ చేసిన దండయాత్రలో ఆలయం తీవ్ర నష్టానికి గురైంది. ఆ సమయంలోనే ఆలయంనుంచి ఎక్కువ సంపదను గజనీకి తరలించినట్టు చారిత్రక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం స్థానిక పాలకులు తిరిగి నిర్మించారు. దిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ, మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ పాలనలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. జునాగఢ్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తరువాత ఉక్కుమనిషి, భారతదేశ ప్రథమ హోంమంత్రి వల్లభాయ్‌పటేల్‌ ఆలయాన్ని సందర్శించి పునర్‌ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. భారత దేశ రాష్ట్రపతి బాబురాజేంద్రప్రసాద్‌ ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు నిధుల సేకరణ చేయకుండా కేవలం భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించడం విశేషం.

ఆలయం అరేబియా సముద్రం సమీపంలోనే ఉండటంతో సూర్యాస్తమయాన్ని వీక్షించేందుకు వల్లబ్‌ఘాట్‌ అనే ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ ఘాట్‌ నుంచి సూర్యాస్తమయం చూడటం భక్తులకు చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌కు సోమనాథ్ ఆలయం 412 కి.మీ. దూరంలో ఉంది.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.