జీ 20 కి నాయకత్వం వహిస్తున్న భారత్.. తన ప్రభావాన్ని ప్రపంచానికి చూపేందుకు రెడీ అయింది. ప్రపంచ అధినేతలను స్వాగతించేందుకు జీ-20 వేదిక అయిన దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా సిద్ధమయింది. నిర్వహణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడనుంది. ఇందు కోసం … ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తోంది.
దుర్భేధ్యమయిన సెక్యూరిటీ
జీ-20కి సారథ్యం వహించే అవకాశం రావడంతో, సదస్సు నిర్వహణను మోదీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో హిట్ టీమ్‌లను దించుతున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డులు, ఢిల్లీ పోలీసుల నుంచి చురుకైన సిబ్బందిని ఎంచుకుని.. వారితో ఏర్పాటుచేసినవే హిట్ టీమ్‌లు. ‘.కాల్చివేత’ అధికారాలు కూడా ఈ టీమ్‌లకు ఇచ్చేశారు. అలాగే.. హోటళ్ల బయట, ప్రాంగణాల ఆవరణలో ఎదురయ్యే భద్రతాసవాళ్లను ఎదుర్కొనేందుకు స్వాట్ బృందాలను సిద్ధం చేశారు. మరోవైపు మన భద్రతా దళాలు, అటు ఆయా దేశాల రక్షణ బృందాలు పెద్దఎత్తున ఢిల్లీలో మోహరించనున్నాయి. కేంద్ర పారా మిలిటరీ, నేషనల్ సెక్యూరిటీ గార్డులు, ఢిల్లీ పోలీస్ బృందాల భద్రతా వలయంలోకి ఢిల్లీ దాదాపుగా వెళ్లిపోయింది. ఒక్కో టీమ్‌కు 1000 మంది చొప్పున సీఆర్పీఎ్‌ఫకు చెందిన యాభై టీమ్‌లు పూర్తిగా జీ-20 ప్రతినిధుల రక్షణ బాధ్యతల్లోనే ఉంటాయి. విదేశీ భద్రతా సంస్థలకు చెందిన కమాండోలు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీకి చేరుకుంటారు. బైడెన్ సెక్యూరిటీ టీమ్ మూడు రోజుల ముందు ఢిల్లీ చేరుకోనుంది
అగ్రనేతలకు అద్భుతమైన ఆతిధ్యం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోసం ఐటీసీ మౌర్యా షెరటన్‌లోని ప్రెసిడెంటల్ సూట్, ఆయన పరివారం కోసం ఆ హో టల్‌లో 400 గదులు ఇప్పటికే బుక్ చేశారు. చైనా అగ్రనేత జీ జిన్‌పింగ్ కోసం తాజ్ ప్యాలె్‌సను సిద్ధం చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి అగ్రదేశాలకు చెందిన ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. జీ-20లో భాగస్వాములైన మిగతా దేశాల నేతలు, ప్రతినిధుల కోసం ఢిల్లీ – ఎన్‌సీఆర్ (దేశ రాజధాని ప్రాదేశిక ప్రాంతం) పరిధిలోని హోటళ్లన్నీ బుక్ అయిపోయాయి. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ఢిల్లీ పరిధిలో హోటల్ అశోకా, హోటల్ ఒబెరాయ్ సహా 20కిపైగా స్టార్ హోటళ్లు సిద్ధమయ్యాయి. ఇక.. ఎన్‌సీఆర్ పరిధిలో ప్రధానంగా గురుగ్రామ్, నోయిడా, సూరజ్‌కుండ్‌ల్లో వివంత, ఒబెరాయ్, క్రౌన్ ప్లాజా సహా ఏడు అత్యంత ఖరీదైన హోటళ్లను బుక్ చేశారు.
మెరిసిపోతున్న డిల్లీ
దక్షిణ ఢిల్లీ గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలోని మునిసిపల్ పార్కులో భారీ మెటాలిక్ జీ-20 లోగోను ఏర్పాటు చేశారు. పార్కులోని పచ్చని తోటల మధ్య సభ్యదేశాల జెండాలను సుందరంగా అలంకరించిన స్తంభాలకు ఏర్పాటు చేశారు. జెండా స్తంభాలను కాంక్రీటుతో నిర్మించి, చెక్కతో మెరుగులు దిద్ది, గోతిక్ డిజైన్‌తో అలంకరించారు. జీ-20 లోగో వెనుక నీలం రంగులో భారీ బోర్డుపై ప్రపంచ మ్యాప్ ఆలంకరించారు. లోగో కింద ‘భారత్ 2023 ఇండియా’ అని ముద్రించారు. పది రోజుల ముందు నుంచే ఢిల్లీ వెలిగిపోతోంది. ఈ సదస్సుతో భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలియనుంది.