తెలుగు భాషకు మోదీ గౌరవం – ఇగ గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం !

ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించనున్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుసంధానం కావడానికి మాతృ భాష చాలా శక్తివంతమైన మాధ్య మం. భారత్‌లో ఎంతో వైభవోపేతమైన భాష తెలుగు. అందుకే ఈ నెల 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుందాం. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు.

2008లో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవ రాయలు చెప్పిన.. చెయ్యేతి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా.. అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగు ను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడ తో పాటు తెలుగును ప్రాచీన భాష గా గుర్తించారు. హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.

గిడుగుకు గౌరవం ఇచ్చిన మోదీ

మనం ప్రతి యేటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాము. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ ఏడాది కవి గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు కూడా జరుగుతున్నాయి. కానీ.. గిడుగు రామ్మూర్తి ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో.. ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. అయితే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

భాషా పరిరక్షణకు కేంద్రం చేయూత

మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ను నిర్లక్ష్యం చేసినా, కేంద్ర ప్రభుత్వం తెలుగును గౌరవిస్తున్నందుకు, మాతృభాష యొక్క విలువను చెప్పిన కేంద్ర ప్రభుత్వనికి, ప్రధాని మోడీ కి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏపీలో అయితే తెలుగు మీడియం ఎత్తేశారు. ఇంగ్లిష్ చదివితేనే ఉద్యోగాలొస్తాయని చెప్పి మాతృభాషను చంపేస్తున్నారు. ప్రపంచం ఏ దేశంలోనూ లేని వింత పోకడలు ఏపీలో ఉన్నాయి. దీన్ని కేంద్రం అడ్డుకట్టు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.