శంకరుడి మానస పుత్రిక మానస దేవి. భక్తి శ్రద్ధలతో ఆమెను పూజిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం…
ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లో బిల్వపర్వతంపై వెలసింది మాతా మానసదేవి. యుగయుగాలుగా భక్తులతో పూజలందుకుంటున్న అమ్మవారి చల్లని చూపు ప్రసరిస్తే చాలు సాధించలేనిది ఏదీ ఉండదని భక్తుల విశ్వాసం.ముఖ్యంగా కాల సర్పదోష నివారణకు మానసదేవిని పూజిస్తారు. మానసదేవిని జరత్కారువు అనే మహర్షికి వివాహం చేసుకుంటాడు. మానసాదేవికి ఉన్న మరోపేరు జరత్కారువు..తన భర్త పేరు కూడా అదే. ఈ దంపతులకు జన్మించిన పుత్రుడు ఆస్తీకుడు. ఒక రోజున జనమజేయ మహారాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. రుత్వికుల మంత్ర పఠనంతో భూమండలం మీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్టుడైన వాసుకి భీతిల్లితుండటంతో సోదర సమానురాలైన మానసదేవి తన కుమారుడైన అస్తీకుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ, తండ్రి మహర్షి..ఒకే పేరుతో ఉన్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావిస్తుంది. యాగ ప్రదేశానికి వెళ్లిన అస్తీకునికి జనమజేయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమజేయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోయింది.
మానసదేవిపై నాగుల కృతజ్ఞత
దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతారు. సంతానం కలగకపోవడానికి జాతకంలో ఉన్న సర్పదోషం కారణం కావొచ్చు..అలాంటి వారు మానసదేవిని పూజిస్తే ఆ ప్రయత్నం సఫలం అవుతుందంటారు పండితులు. హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు వున్నాయి. ఈ మూడు ఆలయాలు శక్తి పీఠాలే. మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడుకుంటారంతా.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.