గవర్నర్‌తో తాత్కలిక రాజీ – కేసీఆర్ ప్లాన్ అదేనా ?

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిశైను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించింది. కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదు . సచివాలయం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సచివాలయంలో ఆలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించడమే కాదు గేటు దగ్గరకు వెళ్లి కేసీఆర్ స్వయంగా ఆహ్వానం పలికారు. తర్వాత సెక్రటేరియట్ ను స్వయంగా చూపించారు.

పదే పదే గవర్నర్ కు అవమానం

గవర్నర్ ప్రజాదర్భార్‌లు నిర్వహించాలనుకోవడంతో పాటు.. ఢిల్లీకి పంపే నివేదికల్లో రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ సర్కార్ గతంలో వచ్చింది. దీంతో అసలు గవర్నర్ వ్యవస్థను గుర్తించడం మానేశారు. ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. ఇటీవల ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజ్ భవన్లో ఎట్ హోమ్ కూడా హాజరు కాలేదు. గవర్నర్ రాజకీయం చేస్తున్నారని మంత్రులు తరచూ విమర్శలు చేస్తున్నారు. కానీ తన చర్యలను .. తమిళిశై ఎప్పటికప్పుడు సమర్థించుకుంటూనే ఉన్నారు. కానీ హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారు

ఎమ్మెల్సీల ఫైల్, పెండింగ్ బిల్లులు ఆమోదం కోసం వ్యూహమా ?

కేసీఆర్ రాజకీయాలు ఊహించనివిగా ఉంటాయి. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి కేబినెట్ ఆమోదించిన ఫైల్ గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్ లో ఉంది. అలాగే ఆర్టీసీ విలీనం పైల్ న్యాయసమీక్షలో ఉంది. ఇవి ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఎన్నికల షెడ్యూల్ వస్తే.. ఎమ్మెల్సీల ఫైల్ పక్కన పెడితే మళ్లీ తర్వాత వచ్చే ప్రభుత్వమే వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చే బిల్లు కూడా ప్రభుత్వానికి ముఖ్యమే. గవర్నర్ తో లొల్లి ఇలాగే కంటిన్యూ అయితే సమస్యలు వస్తాయని కేసఆర్.. రాజీకి వచ్చినట్లుగా రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.

అవసరం తీరిపోయాక మళ్లీ గవర్నర్ అవమానాలేనా ?

గవర్నర్ సంతకాలు పూర్తయ్యాక మళ్లీ ప్రభుత్వం పాత విధానంలోకే వెళ్తుందన్న అంచనాలు ఉన్నాయి. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే చెబుతున్నారు. కేసీఆర్ అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే టైప్ అని.. అందుకే ఆయనను నమ్మలేరని అంటున్నారు. మరి గవర్నర్ నమ్ముతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.