హిమాలయ శిఖరంలా నెయ్యి పేరుకుపోయిన ఆలయం ఇది

దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలున్నాయి. పంచభూత లింగాలు, జ్యోతిర్లింగాలు మాత్రమే కాదు ఇంకా ఎన్నో ప్రత్యేక ఆలయాలున్నాయి. వాటిలో ఒకటి కేరళ రాష్ట్రం త్రిస్సూర్ లో ఉన్న వడక్కునాథన్ ఆలయం. దీని ప్రత్యేకత ఏంటో చూద్దాం….

వడక్కునాథన్ లో కొలువైన పరమేశ్వరుడి ఆలయం విశిష్టత గురించి బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. పరశురాముడే ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్టు స్థలపురాణం చెబుతోంది. స్థల పురాణం ప్రకారం…ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ కొత్త భూమిలో పరమేశ్వరుడిని ప్రతిష్టించాలనుకున్న పరశురాముడు కైలాసానికి వెళ్లి ప్రార్థించగా …పార్వతి, వినాయకుడు, కార్తీకేయుడితో కలిసి పరశురాముడి వెంట బయలుదేరిన శివుడు త్రిస్సూర్‌ ప్రాంతంలోని ఒక పెద్ద మర్రిచెట్టు వద్ద ఆగిపోయారు. స్వామివారికి ఇష్టమైన ప్రదేశం అదేనని గ్రహించిన పరశురాముడు ఆ ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కొచ్చిన్ రాజులు ఈ ఆలయాన్ని సమీపంలో కట్టడంలోకి తరలించారు.

వడక్కునాథన్ శివలింగం ప్రత్యేకత
ప్రధాన ఆలయంలోని శివలింగంపై దాదాపు 16 అడుగుల మేర నెయ్యి నిండిపోయి ఉంటుంది. ఏళ్ల తరబడి నెయ్యితో అభిషేకం చేస్తుండటంతో హిమాలయ పర్వతమే ఆలయం లోపల ఉన్నట్టు కనిపిస్తుంది. శంకరుడి తల్లిదండ్రులైన ఆర్యాంబ, శివగురులు వడక్కునాథన్‌ ఆలయాన్ని సందర్శించడంతో స్వామి అనుగ్రహం వల్ల శంకరులు జన్మించినట్టు ప్రాచీన గ్రంధాలు చెబుతున్నాయి. కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న నిర్మాణంలో నాలుగు గోపురాలు ఠీవిగా కనిపిస్తాయి. గోడలపై వందల సంవత్సరాల ముందు గీసిన రంగు రంగుల చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటాయి.

పూరం ఉత్సవాలు ప్రత్యేకం
కేరళలోని ఆలయాల్లో వేడుకల కన్నా వడక్కునాథన్ ఆలయంలో జరిగే పూరం ఉత్సవాలు చాలా ప్రత్యేకం. ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉన్న మైదానంలో పూరం నిర్వహిస్తారు. తిరువాంబడి, పరమేక్కవు బృందాలుగా పోటీపడతారు. ఇరువైపులా అలంకరణతో ఉన్న ఏనుగులు నిలబడతాయి. ఎదురెదురుగా ఉన్న బృందాలు పంచవాద్యాలను వాయిస్తాయి. గంటల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. అనంతరం రంగురంగుల బాణసంచా కాల్చడంతో వేడుకలు ముగుస్తాయి.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.