ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయండి – చైనా అధ్యక్షుడికి మోదీ వార్నింగ్

భారత – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఓ పటాన తగ్గేలా లేవు. గల్వాన్ ఘర్షణల తర్వాత చర్చలు జరుగుతున్నప్పటికీ డ్రాగన్ దేశ దుశ్చర్యలతో ఘర్షణాత్మక వాతావరణం కొనసాగుతూనే ఉంది. వెస్టర్న్ సెక్టార్ ప్రాంతంలో అవాంఛనీయ సేనల మోహరింపుతో పొరుగుభూమిపై తన కాంక్షను చైనా ప్రదర్శిస్తూనే ఉంది. భారత సైన్యం ఎప్పటికప్పుడు గట్టిగా ప్రతిఘటిస్తూనే ఉంది. మన మంచితనాన్ని చేతగానితనంగా చైనా పరిగణిస్తోందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

బ్రిక్స్ సదస్సులో…

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఎదురుపడ్డారు. భారత్‌-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు (ఎల్‌ఏసీకి) సంబంధించిన వివాదాస్పద అంశాలపై భారత్‌ ఆందోళనను మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇరుదేశాల సంబంధాలు సాధారణస్థితికి చేరాలంటే వాస్తవాధీనరేఖను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రెండో అభిప్రాయానికి తావులేదని తేల్చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని, ఈ మేరకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయాలని మోదీ సూచించగా. జిన్ పింగ్ అందుకు అంగీకరించారు.

మాట్లాడుకుంటూ వచ్చి…

మోదీ, జిన్ పింగ్ బాడీ లాగ్వేంజ్ పాజిటివ్ దృక్కోణంలోనే కనిపించింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ నడిచి వెళ్లారు. వేదికపై ఉమ్మడి ప్రకటన అనంతరం ఇద్దరూ కరచాలనం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే చైనా వైఖరి మారాలని, సరిహద్దుల్లో వివాదాస్పద ప్రదేశాల నుంచి సేనలు వెనక్కి తగ్గాలని భారత్ స్పష్టం చేసింది. అధికారిక ద్వైపాక్షిక చర్చలు జరగకపోయినా ఇద్దరు నేతల మధ్య తూర్పు లద్దాక్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. వీలైనంత తర్వగా సేనల ఉపసంహరణపై చర్చలు జరపాలని నిర్ణయించారు. 2019 బాలీ జీ-20 సదస్సులో ప్రస్తావనకు వచ్చిన సరిహద్దు అంశాలను సైతం ఇద్దరు నేతలు గుర్తుచేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు.

సైనికాధికారుల చర్చలు..

సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునే దిశగా భారత – చైనా సైనికాధికారుల చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. మేజర్ జనరల్ స్థాయి అధికారులు దౌలత్ బే ఓల్డే ప్రాంతంలో ఆగస్టు 19 నుంచి ఆరు రోజుల పాటు చర్చలు నిర్వహించారు. తూర్పు లద్దాక్ ప్రాంత వ్యవహారమే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 13 -14 తేదీల్లో కో కమాండర్ స్థాయి చర్చల పర్యవసానంగా మేజర్ జనరల్ స్థాయిలో భేటీ నిర్వహించారు. డెస్పాంగ్ ప్లెయిన్స్, చార్డింగ్ నిలుంగ్ నాలా (సీఎన్ఎస్) ప్రాంతాలపై వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ , చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ చొరవతో చర్చల ప్రక్రియ ముందుకు సాగుతోందని భారత ప్రభుత్వం ప్రకటించింది.